భారతదేశానికి ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ విమానాలను ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేసింది. అటువంటి చర్య వల్ల దక్షిణాసియాలో ప్రాంతీయ సైనిక సమతౌల్యం, వ్యూహాత్మక స్థిరత్వం దెబ్బతింటాయని, శాంతిస్థాపనకు అవాంతరాలు కలుగుతాయనీ సన్నాయినొక్కులు నొక్కడం మొదలుపెట్టింది. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దంటూ తమ అంతర్జాతీయ భాగస్వామి అయిన అమెరికాను అర్ధించింది.
పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ ‘‘భారతదేశానికి ఆధునిక సైనిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయాలనే ప్రణాళికలపై పాకిస్తాన్ తీవ్రంగా ఆందోళన చెందుతోంది. అటువంటి చర్యలు ప్రాదేశికంగా సైన్యాల మధ్య అసమతౌల్యాన్ని కలుగజేస్తాయి, వ్యూహాత్మక స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి. దక్షిణాసియాలో శాంతిని నెలకొల్పాలన్న లక్ష్యానికి అటువంటి చర్యలు ఏమాత్రం సాయపడబోవు’’ అన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజా అమెరికా పర్యటనలో ద్వైపాక్షిక చర్చల తర్వాత మీడియాతో మాట్లాడిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ‘‘ఈ యేడాది నుంచీ భారతదేశానికి సైనిక అమ్మకాలను విపరీతంగా పెంచుతాము. భారత్‌కు ఎఫ్35 స్టెల్త్ ఫైటర్ విమానాలను అందజేసేందుకు మార్గం సుగమం చేస్తున్నాము’’ అని చెప్పారు.
ఎఫ్35 విమానాలు భారత్ తక్షణమే కొనబోదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వివరించారు. ‘‘రక్షణ కొనుగోళ్ళకు ఒక నిర్దిష్టమైన ప్రక్రియ ఉంటుంది. దానికోసం ముందుగా ప్రతిపాదనలు పంపించాలి. వాటిని పరిశీలించి, మదింపు చేసి తుది నిర్ణయం తీసుకుంటారు. ఎఫ్35 విషయంలో అలాంటి ప్రక్రియ ఏదీ ఇంకా మొదలుకాలేదు. కాబట్టి ప్రస్తుతానికిది ప్రతిపాదన దశలోనే ఉంది. దానికి సంబంధించి లాంఛనాలు ఇంకా మొదలవలేదు’’ అని స్పష్టం చేసారు.
రక్షణ రంగంలో సహకారం కోసం భారత్-అమెరికాలు ‘అటానమస్ సిస్టమ్స్ ఇండస్ట్రీ అలయెన్స్’ (ఎఎస్ఐఎ-ఆసియా) అనే కొత్త ముందడుగు వేసాయి. పారిశ్రామిక భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం, రక్షణ సాంకేతికతల సహకారంలో స్వయంప్రతిపత్తి కలిగిన వ్యవస్థల ఉత్పత్తిని పెంచడం, వంటి ప్రయత్నాలకు ఈ అలయెన్స్ తోడ్పడుతుంది.
మరోవైపు, ముంబైపై 26/11 ఉగ్రవాద దాడి నిందితుడు తహావుర్ హుసేన్ రాణాను భారత్‌కు అప్పగిస్తామని కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. త్వరలో అతడు భారతదేశంలో విచారణను ఎదుర్కొంటాడు అని ట్రంప్ చెప్పారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే వ్యాపారవేత్త తహావుర్ రాణా 26/11 దాడుల కేసులో నిందితుడిగా ఉన్నాడు.