దేశ సరిహద్దుల దగ్గర తనిఖీలను తప్పించుకోడానికి పశువుల స్మగ్లర్లు కొత్తవేషం వేసారు. ఏకంగా బీఎస్ఎఫ్ జవాన్ల వేషమే కట్టేసారు. పశ్చిమబెంగాల్ నుంచి బంగ్లాదేశ్‌లోకి పశువులను అక్రమంగా చేరవేయడానికి ఆ దారుణానికి ఒడిగట్టారు. ఇంతకీ వారు నిజమైన బీఎస్ఎఫ్ దళాలకు దొరికిపోయారు.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్ విభాగం ఆ ఆపరేషన్ చేపట్టింది. మాల్డా, ముర్షీదాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో వేర్వేరు సంఘటనల్లో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసింది. వారిలో ముగ్గురు పన్నాపూర్ బోర్డర్ ఔట్‌పోస్ట్ దగ్గర పట్టుబడ్డారు. బీఎస్ఎఫ్ యూనిఫాం ధరించి నకిలీ ప్లాస్టిక్ గన్ చేత పట్టుకుని వారు బెంగాల్ భూబాగం నుంచి బంగ్లాదేశ్‌లోకి అక్రమంగా పశువులను తోలుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారి దగ్గర నుంచి బీఎస్ఎఫ్ జవాన్లు రెండు గేదెలు, రెండు కత్తులు, ఒక చాకు స్వాధీనం చేసుకున్నారు.
మరో సంఘటనలో బీఎస్ఎఫ్ జవాన్లు ఒక వ్యక్తి దగ్గర ఐదు సంచీల్లో ఫెన్సెడిల్ అనే దగ్గుమందు 897 సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యంగా ఉపయోగించే ఆ మందును పశ్చిమ బెంగాల్ సరిహద్దుల నుంచి బంగ్లాదేశ్‌లోకి స్మగుల్ చేయడం తరచుగా జరుగుతూనే ఉంటుంది. అతనితో పాటు ఉన్న వ్యక్తులు పారిపోగలిగారు. జవాన్లకు దొరికిపోయిన ఒక వ్యక్తిని విచారణ చేసినప్పుడు అతను బంగ్లాదేశీయుడినని, తన వృత్తి క్రాస్-బోర్డర్ స్మగ్లింగ్ అనీ ఒప్పుకున్నాడు.
బీఎస్ఎఫ్ జవాన్లు తాము అరెస్ట్ చేసిన స్మగ్లర్లను, వారి దగ్గర స్వాధీనం చేసుకున్న పశువులు, డ్రగ్స్‌ను తదుపరి న్యాయపరమైన చర్యల కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు. పశువులకు ఎలక్ట్రానిక్ ట్యాగ్స్ తగిలించి వాటిని ఓ జంతు సంరక్షణశాలకు అప్పగించారు.