ఇప్పటికే 50 కోట్ల మంది పవిత్రస్నానాలు
అంచనాలకు మంచి పోటెత్తిన భక్తులు…
ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటివరకూ 50 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారు. అయితే ఈ దఫా కుంభమేళా భక్తులకు సంబంధించిన పలు సాహస ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచింది. రకరకాల సాహసాలు, విన్యాసాలు చేస్తూ కుంభమేళాలో పాల్గొంటున్నారు.
కర్రసాము చేసే సాధువులు, పక్షలు, పాములు ధరించిన సన్యాసులు, చిత్రవిచిత్రంగా కనిపించే అఘోరాలు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అయితే 90 ఏళ్ళ మాతృమూర్తిని 60 ఏళ్ళు నిండిన కుమారుడు ఎండ్లబండిపై కుంభమేళాకు తీసుకొచ్చాడు. అలాగే ఏపీ నుంచి పలువురు యువకులు సీఎన్జీ ఆటోలో ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు.
ఓ అగ్నివీర్ కూడా ఇలాంటి పెద్ద సాహసమే చేసి కుంభమేళాలో పాల్గొన్నాడు. బిహార్ లోని సహర్సా నుంచి జనవరి 23న కుంభమేళాకు పరుగు ప్రారంభించాడు. 17 రోజుల పాటు రోజుకు 10 గంటపాలు పరుగుపెడుతూ ఫిబ్రవరి 8 మధ్యాహ్నం 12 గంటలకు పవిత్ర త్రివేణీ సంగమం చేరుకున్నాడు. దాదాపు 1,100కిలోమీటర్లు పరిగెత్తాడు.
ఈ పరుగులో అతను పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఫిబ్రవరి ఒకటిన అనారోగ్యానికి గురికాగా అంతకు ముందు అతని ఫోను, పర్సును దొంగలు కొట్టేశారు. రూపేష్ తో పాటు మరో ఇద్దరు స్నేహితులు ఈ ఘట్టంలో భాగస్వాములయ్యారు. అయితే భక్తియార్పూర్ చేరుకోగానే వారిద్దరూ అలసిపోయి వెనుదిరిగారు. అలాంటి పరిస్థితిలోనూ రూపేష్ ధైర్యాన్ని కోల్పోక 1,100 కిలోమీటర్ల తన పరుగుయాత్రను పూర్తిచేశాడు.
కుంభమేళాలో ఇప్పటివరకు పుణ్య స్నానం చేసిన మొత్తం భక్తుల సంఖ్య 50 కోట్లు దాటింది. మౌని అమావాస్య నాడు గరిష్టంగా 8 కోట్లు మంది, మకర సంక్రాంతినాడు 3.5 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానం చేశారు. ఫిబ్రవరి ఒకటి, జనవరి 30 తేదీలలో రెండు కోట్లమంది పుష్య పూర్ణిమ నాడు 1.7 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. వసంత పంచమి నాడు 2.57 కోట్ల మంది మాఘ పూర్ణిమ నాడు కూడా రెండు కోట్ల మంది పవిత్ర సంగమంలో స్నానాలు ఆచరించారు.