స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలను నమోదు చేస్తున్నాయి. వరుసగా ఎనిమిది ట్రేడింగ్ సెషన్స్‌లోనే మదుపరులు రూ.25 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. సెన్సెక్స్ 76000, నిఫ్టీ 23000 పాయింట్ల దిగువకు పడిపోయింది. గత ఏడాది అక్టోబరులో మొత్తం స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 477 లక్షల కోట్లు ఉండగా, అది శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 400 లక్షల కోట్లకు పడిపోయింది. గడచిన వారంలోనే 25 లక్షల కోట్లకుపైగా మదుపరుల సంపద ఆవిరైంది.
త్రైమాసిక ఫలితాలు అనుకూలంగా లేకపోవడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటోన్న నిర్ణయాలతో స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున షేర్ల అమ్మకాలను తెగబడుతున్నారు. దీంతో స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది.
శుక్రవారం నాడు రూపాయి స్వల్పంగా బలపడింది. 26 పైసలు బలపడి 86.74కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. తాజాగా బ్యారెల్ ముడిచమురు ధర 75 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ఔన్సు స్వచ్ఛమైన బంగారం ధర 2687 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కిలో వెండి 94వేలు దాటిపోయింది.