మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించడంతో అక్కడి భద్రతా పరిస్థితిపై అధికారులు దృష్టి సారించారు. కుకీ మెయితీ తెగల మధ్య ఘర్షణల కారణంగా ఉద్రిక్తపూరితంగా మారిన మణిపూర్‌లో అక్రమ కార్యకలాపాలను అధికారులు ఉక్కుపాదంతో అణిచేస్తున్నారు. ఆ క్రమంలోనే మణిపూర్ పోలీసులు గురువారం రాత్రి ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసారు. కారణం, వారు ఎకె-47వంటి ఆధునిక తుపాకులు ధరించి ఫుట్‌బాల్ ఆడడమే.
ఈశాన్య భారత ప్రాంత రాష్ట్రం మణిపూర్‌లో ఈమధ్య ఒక వీడియో వైరల్ అయింది. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోకు విస్తృత ప్రాచుర్యం లభించింది. కాంగ్‌పోక్‌పీ జిల్లా కె గామ్‌నోమ్‌ఫాయ్ గ్రామంలో 10-15 మంది వ్యక్తులు ఫుట్‌బాల్ ఆడారు. అయితే వారి చేతిలో ఫుట్‌బాల్ లేదు. దానికి బదులు వారు అసాల్ట్ రైఫిల్స్ ధరించి ఉన్నారు. ఆ చర్య 1959 నాటి ఆయుధాల చట్టాన్ని ఉల్లంఘించడమేనని పోలీసులు స్పష్టం చేసారు. దాంతో వారు తక్షణం చర్యలు తీసుకున్నారు.
ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో తుపాకులు ధరించి పోజులు ఇచ్చిన వారిలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసారు. సంబంధిత సెక్షన్లతో కేసు నమోదు చేసారు. అసలు వారికి ఆయుధాలు ఎక్కడినుంచి వచ్చాయి, ఉగ్రవాదులతో సంబంధాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బహిరంగంగా ఆయుధాలను అక్రమంగా ప్రదర్శించిన సంఘటనలో ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలోనూ పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.
మణిపూర్‌లో పలువురు అతివాదుల దగ్గరుండే ఆయుధాల తనిఖీ సరిగ్గా జరగడం లేదన్న ఆందోళనలున్నాయి. మారణాయుధాలను బహిరంగంగా ప్రదర్శిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ మెయితీ కోఆర్డినేటింగ్ కమిటీ, మెయితీ హెరిటేజ్ సొసైటీ వంటి సంస్థలు ఇప్పటికే పిలుపునిచ్చాయి.
మణిపూర్‌లో ఇప్పుడు అధ్యక్ష పాలన విధించినందున, కేంద్రం అక్కడ భద్రతను పటిష్టం చేసింది. చట్టవ్యతిరేక ముఠాలను పట్టుకోడానికి అదనపు బలగాలను మోహరించింది. రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న సంస్థల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుంటామని, రాష్ట్రంలో సాధారణ పరిస్థితిని పునరుద్ధరిస్తామని, పౌరుల భద్రత రక్షణలే తమ తొలి ప్రాధాన్యమని కేంద్ర రక్షణ శాఖ పునరుద్ఘాటించింది.