ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగా షష్ఠ షణ్ముఖ క్షేత్రాల పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ మూడు దేవాలయాలను సందర్శించారు. పళని, తిరుప్పరంకుండ్రం క్షేత్రాల్లో సుబ్రహ్మణ్యేశ్వరుడిని, మదురైలో మీనాక్షీదేవినీ దర్శించుకున్నారు.
పవన్ కళ్యాణ్ ఈ ఉదయం పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అరుళ్‌మిగు దండాయుధపాణి క్షేత్రానికి రోప్‌వే ద్వారా చేరుకున్నారు. అక్కడ ఉచ్ఛ కాల పూజలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ “పళని నుంచి తిరుమలకు రవాణా సౌకర్యాలు కల్పిస్తాము. ఇటీవల మహారాష్ట్రలో పర్యటించినప్పుడు అక్కడి నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు కావాలని అక్కడి ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరారు. ఆ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్ళాను. పళని నుంచి తిరుమలకు కూడా తగిన రవాణా సౌకర్యం కల్పించడం పైన దృష్టి పెడతాము’’ అని చెప్పారు.
పళని తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సాయంత్రం తిరుపరంకుండ్రం దివ్య క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ క్షేత్రాన్ని ఆక్రమించుకునే దురుద్దేశంతో ముస్లిములు ఈమధ్య వివాదాలు రేపుతున్న సంగతి తెలిసిందే. అక్కడ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామికి పవన్ కళ్యాణ్ మొక్కులు చెల్లించుకున్నారు. అదే ఆవరణలోని శివ, విష్ణు ఆలయాలను కూడా దర్శించుకున్నారు. అనంతరం ఆలయం లోపలే ఉన్న వేద పాఠశాలను సందర్శించారు.
తిరుపరంకుండ్రం నుంచి మదురై చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ మీనాక్షీ అమ్మన్, సోమసుందరేశ్వరన్ స్వామి వార్లను దర్శించుకున్నారు. మొదట మధుర మీనాక్షి అమ్మవారికి చీర, సారె సమర్పించారు. ప్రత్యేక పూజల తర్వాత ఆలయంలోనే పవన్ కళ్యాణ్ పరాశక్తి పారాయణం చేసారు. అనంతరం సోమసుందరేశ్వర స్వామిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, పండితులు ఆలయంలోని శిల్పకళను, దాని ప్రాశస్త్య, విశిష్టతలను పవన్ కళ్యాణ్‌కు వివరించారు.