ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మండిపాటు
ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్ తీరును తప్పుబట్టిన జగన్… రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి స్థానం లేకుండా పోయిందని విమర్శించారు. పాలకవర్గం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ అరెస్టులతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉందని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. దళిత యువకుడిని అడ్డుపెట్టుకుని తప్పుడు కేసు పెట్టారన్నారు. తనతో టీడీపీ వాళ్ళు తప్పుడు కేసు పెట్టించారని సాక్షాత్తూ సదరు యువకుడే జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వాంగ్మూలం ఇచ్చిన రోజే యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి బెదిరించడం సరైన చర్యా అని ప్రశ్నించారు.
దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై నమోదైన కేసును కూడా జగన్ తప్పుబట్టారు. ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చలేక ప్రజల దృష్టి మరల్చేందుకు వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతూ, అక్రమ అరెస్టులు చేస్తున్నారని ట్వీట్ లో పేర్కొన్నారు.
మండలిలో మంత్రి లోకేశ్ మాజీ మంత్రి బొత్స వాగ్వాదం : ఇంగ్లీషు వీరికి అర్థం కావడం లేదంటూ లోకేశ్ ఎద్దేవా