బంగ్లాదేశ్‌లోని సోలాహాటి దుర్గా మందిరంపై అతివాదులు దాడి చేసారు, సరస్వతీ దేవి విగ్రహాలు రెండింటిని ధ్వంసం చేసారు. ఆ దుర్ఘటన ఢాకా నగరంలోని తురాగ్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజాము చోటు చేసుకుంది.
గుడిపై దాడి జరిగిన విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసారని కేసు నమోదు చేసారు. ఆ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు.
స్థానికుల కథనం ప్రకారం, గురువారం తెల్లవారుజామున సుమారు 4గంటల సమయంలో కొందరు అతివాదులు తెల్లటి కారులో దేవాలయం దగ్గరకు వచ్చారు. సరస్వతీ దేవి విగ్రహాలను ధ్వంసం చేసి, కారులో పరారయ్యారు. ‘‘దుర్గాదేవి విగ్రహం నిమజ్జనం చేసిన తర్వాత సరస్వతీ దేవి మూర్తిని గుడిలోనే ఉంచాం. కొన్నాళ్ళ క్రితం వసంత పంచమి సందర్భంగా సరస్వతీ పూజ కోసం కొత్త విగ్రహం కూడా తయారు చేయించాం. ఆ రెండింటినీ ధ్వంసం చేసారు’’ అని సోలాహాటి దుర్గా మందిరం అధ్యక్షుడి కుమారుడు పలాశ్ సర్కార్ వెల్లడించారు.
అతివాదులు గుడిలోకి ప్రవేశించడాన్ని అక్కడ దగ్గరలో ఉన్న పశువుల పాకలోని కాపరి చూసాడు. కానీ, దుండగుల దగ్గర ఆయుధాలు ఉన్నాయేమోనని భయపడ్డాడు. గుడివైపు రాకుండా ఊళ్ళోకి వెళ్ళి జనాలను పిలుచుకొచ్చాడు. వారు వచ్చేసరికే దుండగులు వెళ్ళిపోయారు.
స్థానిక హిందువులు పోలీసులను పిలిచినా, వారు పూర్తిగా పొద్దెక్కిన తర్వాతనే వచ్చారు. స్థానికుల సాక్ష్యాలు సేకరించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి వెళ్ళిపోయారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ కూడా తనిఖీ చేసారు. అయినా ఆ దాడికి పాల్పడిన వారిని కనుగొనలేకపోయారు.
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని పతనం చేసి అమెరికా కీలుబొమ్మ సర్కారు గద్దెనెక్కిన నాటినుంచీ అక్కడి హిందువులపై దాడులు జరుగుతున్నాయి. తొలినాళ్ళలోని ఉధృతం తగ్గినప్పటికీ, దాడులు ఆగలేదు. జనవరి 31న ఫరీద్‌పూర్‌లోని కాళికాదేవి మందిరంలోకి మిరాజుద్దీన్ అనే ఒక ముస్లిం వ్యక్తి చొరబడి సరస్వతీదేవి మూర్తిని ధ్వంసం చేసాడు. అతన్ని స్థానికులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. న్యాయస్థానం అతన్ని పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఆ మిరాజుద్దీన్ గతేడాది ఫిబ్రవరిలో ఫరీద్‌పూర్‌లోని ఇస్కాన్ దేవాలయంలోకి చొరబడి సరస్వతీదేవి మూర్తిని ధ్వంసం చేసాడు. అప్పట్లో అతన్ని మతిస్థిమితం లేనివాడంటూ కోర్టు వదిలిపెట్టేసింది.