గంజాయి రాష్ట్రంగా పేరు గడించిన తమిళనాడు ఇప్పుడు మరో చెడ్డపేరు తెచ్చుకుందంటూ ఆ రాష్ట్ర ప్రజలు వాపోతున్నారు. దేశంలోనే అత్యధిక లైంగిక దాడుల కేసులతో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన రాష్ట్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా సమానత్వం, సాధికారత అంటూ గొప్పలు చెప్పుకునే డీఎంకే సర్కారు చూపిస్తున్న ద్రవిడ నమూనా ఇదేనా అని భయపడుతున్నారు.
‘‘గత 40 రోజుల్లో లైంగిక దాడి, వేధింపులు, చిత్రహింసలు తదితర నేరాలకు సంబంధించి 120 కేసులు నమోదయ్యాయి. ప్రజలు భయభ్రాంతులైపోయి ఉన్నారు. బైటకు రావడానికి కూడా ధైర్యం చేయడం లేదు. గత 9 రోజుల్లో రాష్ట్రంలో 48 లైంగికదాడులు జరిగాయి. స్టాలిన్ ద్రవిడ నమూనా పాలనలో మహిళలు, బాలికల భద్రత ఆందోళనకరంగా, ప్రశ్నార్థకంగా మారింది. పోలీసుల వద్దకు వచ్చిన వందలాది కేసులు నమోదు అవలేదు. సమాజంలో పరువు పోతుందేమో అని భయపడి అసలు పోలీసుల దగ్గరకే రాకుండా, ఫిర్యాదు చేయకుండా ఉండిపోయిన కేసులు ఇంకెన్నో లెక్క తెలీదు’’ అని ఒక నెటిజన్ తన ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేసారు.
గత వారంరోజుల్లో కదులుతున్న రైలులో మహిళపై లైంగిక దాడి జరిగిన కేసులు రెండు నమోదవడంతో ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రయాణించడానికి కూడా మహిళలు భయపడుతున్నారు. నేరస్తులకు అధికార పక్షం అండదండలు ఉండడం, చట్టంలో లోపాల కారణంగా నేరస్తులకు బెయిల్ త్వరగా సులువుగా రావడం వంటి కారణాల వల్ల మహిళలపై నేరాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.
ఫిబ్రవరి 9న ఒక బాధితురాలికి సహాయం గురించి ప్రకటిస్తూ ఆమె వివరాలను స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయమే బైటపెట్టడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. సీఎంఓ ట్వీట్‌లో ఒక బాధిత మహిళ పేరు, ఆమె భర్త పేరు, ఆమె గ్రామం వివరాలను బహిరంగపరిచారు. దానిపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో ఆ పోస్ట్‌ను తొలగించారు. దాన్నిబట్టే బాధిత మహిళల విషయంలో డీఎంకే ప్రభుత్వం నిర్లిప్త ధోరణి అర్ధమవుతుంది.
బాధితురాళ్ళ పేర్లు బైటపెట్టడం ఇదేమీ మొదటిసారి కాదు. తమిళనాడు పోలీసులు లైంగిక దాడుల బాధితురాళ్ళ వివరాలు బహిర్గతం చేసిన సందర్భాలు గతంలో కోకొల్లలు. అన్నా యూనివర్సిటీలో లైంగిక దాడి బాధితురాలి, చెన్నైలో డీఎంకే జెండా ఉన్న కారులో ఒక మహిళను వెంటపడి వేధించిన కేసులో బాధితురాలి పేర్లను తమిళనాడు పోలీసులు బైటపెట్టడం సమీప గతంలోని విషయం.
ఫిబ్రవరి 6న వెల్లూరు దగ్గర రైల్లో ప్రయాణిస్తున్న నాలుగు నెలల గర్భవతిపై అత్యాచారం చేసి ఆమెను రైలులోనుంచి బైటకు తోసేసారు. దాంతో ఆమెకు గర్భస్రావమైంది, ఆమె ఇంకా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో ఉంది. ఆ సంఘటన మరువక ముందే మరో సంఘటన చోటు చేసుకుంది. ఈసారి ఈరోడ్ సమీపంలో ట్యుటికోరన్-ఓఖా ఎక్స్‌ప్రెస్ జనరల్ కోచ్‌లో తెల్లవారుజాము సమయంలో కె సతీష్‌కుమార్ (33) అనే వ్యక్తి ఒక మహిళపై అత్యాచారానికి ప్రయత్నించాడు. బాధితురాలి కేకలు విని లేచిన తోటి ప్రయాణికులు అతన్ని నిర్బంధించి, తర్వాత వచ్చిన దిండిగల్ స్టేషన్‌లో పోలీసులకు పట్టిచ్చారు.
ఇలా, పలు కేసుల్లో మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే స్టాలిన్ సర్కారు సనాతన మతాన్ని తిడుతూ ఉండాల్సిన హడావుడిలో మహిళల భద్రత అంశాన్ని గాలికి వదిలేసింది. మహిళలు, బాలికలు, చిన్నారి పిల్లల మీద జరుగుతున్న దాడులను నిలువరించడంలో డీఎంకే ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.