అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి పైశాచికత్వానికి పాల్పడ్డాడు. యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు ముఖంపై యాసిడ్ పోశాడు. గుర్రంకొండ మండలం ప్యారంపల్లెలో ఈ ఘటన జరిగింది. గాయాలపాలైన బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…
ప్యారంపల్లెకు చెందిన యువతి డిగ్రీ వరకు చదివి, మదనపల్లెలోని ఓ బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తోంది. అమ్మచెరువుమెట్టకు చెందిన గణేశ్ యువకుడు యువతిని ప్రేమ పేరిట వేధించేవాడు. యువతికి ఈనెల 7న బంధువుల అబ్బాయితో నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 29న పెళ్లి జరగనుంది. పెళ్ళి ఖరారు విషయం తెలుసుకున్న గణేశ్.. శుక్రవారం ఉదయం 6 గంటలకు గ్రామానికి చేరుకున్నాడు. యువతి తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్ళగా యువతిపై దాడి చేసిన గణేశ్ ముఖంపై యాసిడ్ పోశాడు. అనంతరం కత్తితో దాడి చేశాడు.
యువతి కేకలతో చుట్టుపక్కల వాళ్ళు ఆమె దగ్గరికి చేరుకుని 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడి చేసిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు కూడా యాసిడ్ తాగి వేరే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్థానికులు మాట్లాడుకుంటున్నారు.
ఘటన విషయం తెలుసుకున్న వెంటనే ప్రభుత్వం అప్రమత్తమైంది. పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించిన హోంమంత్రి అనిత మెరుగైన వైద్యం కోసం అవసరమైతే బెంగళూరుకు యువతిని తరలించాలని ఆదేశించారు.
యువతికి మెరుగైన వైద్య సాయం అందించి అండగా నిలుస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. నిందితుడిని కఠినంగా శిక్షించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసిన కాంగ్రెస్ నేత