2019 ఫిబ్రవరి 14న జమ్మూ నుంచి శ్రీనగర్ వెడుతున్న సీఆర్‌పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌ని పుల్వామా దగ్గర ఒక ఎర్ర రంగు వాహనం ఢీకొట్టి పేలిపోయింది. దాన్ని నడుపుతున్న ఆదిల్ అహ్మద్ దర్, పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌కు చెందిన ఆత్మాహుతిదళ సభ్యుడు. ఆ సూసైడ్ బాంబర్ చేసిన దాడిలో 40మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులయారు.
ఆ దాడికి సూత్రధారి అయిన జైషే మొహమ్మద్ సంస్థను స్థాపించింది మౌలానా మసూద్ అజర్. 1999 డిసెంబర్‌లో హైజాక్ అయిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని వదిలేయడానికి ప్రతిగా ఉగ్రవాదులు విడిపించుకున్న నాయకుడు అతనే. భారత్ వదిలిపెట్టిన తర్వాత మౌలానా మసూద్ అజర్ నేరుగా పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. తర్వాత జమ్మూకశ్మీర్‌లో భారీ సంఖ్యలో ఆత్మాహుతి దాడులు చేయించిన సూత్రధారి అతనే. ఆ క్రమంలో జరిగినదే పుల్వామా దాడి కూడా.
పుల్వామా దాడి జరిగిన నెల తర్వాత మసూద్ అజర్ మేనల్లుడు మొహమ్మద్ ఉమర్ ఫారూఖ్ అలియాస్ ఇద్రీస్ భాయ్ కశ్మీర్‌లో ఒక ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అతని తండ్రి ఇబ్రహీమ్ అత్తర్… 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన ఐదుగురిలో ఒకడు. పుల్వామా దాడి సంఘటన గురించి దర్యాప్తు చేసే పనిని ఎన్ఐఏ జమ్మూకశ్మీర్ విభాగం అధిపతి రాకేష్ బల్వాల్‌కు భారతప్రభుత్వం అప్పగించింది.
ఆ దర్యాప్తులో ఆదిల్ అహ్మద్ దర్, ఇద్రీస్ భాయ్‌తో పాటు మరికొంతమంది కూడా పాల్గొన్నట్లు వెల్లడైంది. వారిలో సమీర్ అహ్మద్ దర్ అలియాస్ హంజీలా జిహాదీ, మొహమ్మద్ ఇస్మాయిల్ అల్వీ అలియాస్ సైఫుల్లా, ఆసిక్ అహ్మద్ నెంగ్రూ, అమ్మర్ అల్వీ, నూర్ మొహమ్మద్ టాంట్రే, ఇన్షా జాన్ ఉన్నారు.
పుల్వామా దాడి తర్వాత భారత-పాక్ ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి. వాటిని మళ్ళీ పునరుద్ధరించాలంటూ పాకిస్తాన్ ఎన్నిసార్లు ప్రయత్నించినా భారత్ ఒప్పుకోలేదు. పుల్వామా దాడి జరిగిన పక్షం రోజుల్లోగా అంటే 2019 ఫిబ్రవరి 26న పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్ మీద భారత్ గగనతల దాడులు చేసింది. ఆ దెబ్బకి పాకిస్తాన్‌లోని వివిధ ఉగ్రవాద సంస్థల నాయకులందరినీ పాకిస్తానీ గూఢచారి సంస్థ ఐఎస్ఐ అండర్‌గ్రౌండ్‌లోకి పంపించేసింది. ఆ సమయంలో ఐఎస్ఐ అధినేత లెఫ్టినెంట్ జనరల్ అసీమ్ మునీర్. అతనిప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌గా ఉన్నాడు.
ఈ మధ్య భారత ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ పాకిస్తానీ ఉగ్రవాదుల గురించి మాట్లాడుతూ జమ్మూకశ్మీర్‌లో ఇంకా క్రియాశీలంగా ఉన్న ఉగ్రవాదుల్లో 80శాతం మంది పాకిస్తానీలే అని వెల్లడించారు. ఆ ప్రకటనపై పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ స్పందించాడు. భారత భూభాగంలో పాకిస్తానీ ఉగ్రవాదులు పనిచేయడం లేదంటూ అతను ఖండించాడు.
ఆ తర్వాత కొద్దిరోజులకే, అంటే మొన్న 12 ఫిబ్రవరి 2025న అఖ్నూర్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్ద భారత సైనిక బలగాలు పహరా కాస్తున్న ప్రదేశంలో వారిని లక్ష్యం చేసుకుని ఒక ఐఈడీ బాంబు పేలింది. ఆ దాడిలో ఇద్దరు భారత సైనికులు అమరులయ్యారు, మరొకరు గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన ఇద్దరిలో ఒకరు ఝార్ఖండ్ రాంచీకి చెందిన కెప్టెన్ కరంజిత్‌సింగ్ బక్షీ, మరొకరు సాంబా సెక్టార్‌కు చెందిన జవాను ముఖేష్ సింగ్ మాన్హాస్. వారిద్దరికీ వచ్చే ఏప్రిల్ నెలలో పెళ్ళి జరగాల్సి ఉంది.
జమ్మూకశ్మీర్‌లో కొన్ని దశాబ్దాలుగా నెలకొని ఉన్న ఆందోళనకర పరిస్థితుల వల్ల అక్కడ భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, నిఘా వర్గాలు సరిహద్దుల భద్రతతో పాటు అంతర్గత భద్రతను కూడా స్థానిక పోలీసులతో కలిసి పర్యవేక్షిస్తుంటారు. జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో రాష్ట్ర పోలీసులు కేవలం శాంతిభద్రతలను పర్యవేక్షించడానికే పరిమితం కారు, ఉగ్రవాదంపై పోరాటంలో కీలక పాత్ర పోషిస్తుంటారు.
గత రెండు వారాల వ్యవధిలో సరిహద్దులకు అవతలి నుంచి కాల్పులు జరిపిన సంఘటనలు నాలుగు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే ఆ దాడుల సంఖ్య తగ్గినప్పటికీ, పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదు.