బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన శ్రీశైలం
నడకదారి భక్తుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు
ఏపీలోని 99 ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు
3,500 సర్వీసులు నడపనున్న ఏపీఎస్ ఆర్టీసీ
మహాశివరాత్రి సందర్భంగా ఏపీలోని శైవక్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, అమరావతి, పంచారామాల్లో శివరాత్రి కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో నడకదారి భక్తుల కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.
మల్లన్న దర్శనం కోసం పాదయాత్ర గా వచ్చే భక్తుల కోసం నల్లమల పరిధిలోని 40 కిలోమీటర్ల దారిని సిద్ధం చేశారు. శివమాలధారులు, మొక్కులున్న భక్తులు ఈ నెల 17 నుంచి 23 వరకు ఈ దారి గుండా ప్రయాణించేందుకు అటవీశాఖ అనుమతించింది.
పాదయాత్రగా వచ్చే భక్తులు తమ వెంట 2, 5 లీటర్ల నీటి సీసాలే తీసుకెళ్లేందుకు అటవీశాఖ అనుమతించింది. స్టీలు, రాగి, గుడ్డసంచుల్లో నీరు తెచ్చుకోవచ్చు. మార్గమధ్యంలో మూడు ప్రాంతాల్లో నీటి ట్యాంకులు అందుబాటులో ఉంచనున్నారు.
భక్తుల పర్యవేక్షణ కోసం 25 మంది అటవీ సిబ్బంది, 40 మంది ప్రొటెక్షన్ వాచర్లు, 70 మంది వాలంటీర్లు సేవలు అందించనున్నారు. నాగలూటి, దామర్లకుంట, పెచ్చెర్వు, భీమునికొలను ప్రాంతాల్లో అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
అలాగే అన్ని డిపోలు, ముఖ్య పట్టణాల నుంచి శ్రీశైలానికి బస్సులు వెళ్ళనున్నాయి. శివరాత్రి సందర్భంగా ఆర్టీసీకి రూ.11 కోట్ల రాబడి వస్తుందని ఆ సంస్థ అంచనా వేసింది.
మహా శివరాత్రి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖమైన 99 శైవ క్షేత్రాలకు శివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సులు నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. సుమా 3,500 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. అత్యధికంగా వైఎస్‌ఆర్ జిల్లాలో 12 క్షేత్రాలకు, నెల్లూరు జిల్లాలోని 9 క్షేత్రాలకు, తిరుపతి జిల్లాలో 9 క్షేత్రాలకు, నంద్యాల జిల్లాలో 7 క్షేత్రాలకు బస్సులు నడపనున్నారు. శ్రీసత్యసాయి జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఉండేలా చర్యలు తీసుకున్నారు.