అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయులను ఆదేశం వెనక్కి పంపే ప్రక్రియను కొనసాగిస్తోంది. మొదటి విడతలో 104 మంది భారతీయులను యుద్ధవిమానంలో పంపిన అమెరికా, తాజాగా మరో రెండు విమానాల్లో భారతీయులను స్వదేశానికి పంపనుంది. ఫిబ్రవరి 15న విమానంలో 170 నుంచి 180 మంది, ఆ తర్వాత మరో విమానంలో మరికొంతమందిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అమెరికా మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అమెరికాలో అక్రమవలసదారుల జాబితాలో మరో 487 మంది ఉన్నట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది. అక్రమ వలసదారులను తీసుకొచ్చే విమానాలు అమృత్సర్లో దిగడంపై పంజాబ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని పంజాబ్ ప్రభుత్వం మండిపడింది.
అక్రమ వలసదారుల తరలింపులో యూఎస్ కు భారత్ సహకారం…
అక్రమ వలసలు ఏ దేశానికైనా సమస్యేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎవరైనా సరే ఓ దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, అక్కడే స్థిరపడతామంటే కుదరదని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధంగా ఓ దేశంలో అడుగుపెట్టివారికి అక్కడ నివసించే హక్కు ఉండదని స్పష్టం చేశారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చే విషయంలో ప్రెసిడెంట్ ట్రంప్ కు సహకరిస్తామని చెప్పారు.
అయితే అక్రమంగా అమెరికాలో ప్రవేశించిన భారతీయుల్లో చాలామంది హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడ్డవారేనని మోదీ అన్నారు. డాలర్లు, ఉద్యోగాల ఆశజూపి కొంతమందిని మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.