వైఎస్ఆర్సిపి మాజీ నేత, మాజీ మంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ళ నాని) తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయన సమక్షంలో టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు పచ్చ కండువా కప్పి ఆళ్ల నానిని పార్టీలోకి ఆహ్వానించారు.
వైఎస్ జగన్ హయాంలో మొదటి దశ మంత్రివర్గంలో ఆళ్ళ నాని మంత్రిగా పనిచేసారు. కరోనా సంక్షోభ సమయంలో వైద్య ఆరోగ్యశాఖను ఆయన నిర్వహించారు. జగన్ రెండో దశ మంత్రివర్గం అధికారంలోకి వచ్చాక ఆళ్ళ నాని నిస్తబ్ధమైపోయారు. ఇక 2025 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిన వెంటనే, మూడు నెలలు తిరగకుండానే పార్టీని వదిలిపెట్టారు. వైఎస్ఆర్సిపి శిబిరాన్ని విడిచిపెట్టిన మొదటి పెద్దస్థాయి నాయకుడు ఆళ్ళ నానియే. అయితే, అప్పటినుంచే తెలుగుదేశంలో చేరడానికి ప్రయత్నించినా కుదరలేదు. ఏలూరు స్థానిక ఎంఎల్ఎ బడేటి రాధాకృష్ణే టీడీపీలోకి ఆళ్ళ నాని రాకను అడ్డుకున్నారన్న ప్రచారం ఉంది. ఎట్టకేలకు నాని ఇవాళ రాత్రి టీడీపీలో చంద్రబాబు సమక్షంలో చేరారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మంత్రి పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ, సీనియర్ నేత సుజయ్ కృష్ణ రంగారావు తదితరులు పాల్గొన్నారు.