ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా ఇవాళ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ శాయి తన మంత్రివర్గ సహచరులతో కలిసి త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. తమ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రార్థన చేసారు. మహాకుంభమేళా కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేసారంటూ ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
‘‘నాతోపాటు ఛత్తీస్‌గఢ్ గవర్నర్ రామెన్ డేకా, స్పీకర్ రమణ్ సింగ్, మంత్రులు, ఎంఎల్ఎలు మొత్తం 166 మందిమి వచ్చాము. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించాము. ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అరుదైన సందర్భం. ఇక్కడ గొప్ప ఏర్పాట్లు చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి అభినందనలు. మమ్మల్ని ఆహ్వానించినందుకు ఆయనకు ధన్యవాదాలు’’ అని విష్ణుదేవ్ శాయి చెప్పారు.
ప్రయాగరాజ్‌లో కుంభమేళా సందర్భంగా ఏర్పాటు చేసిన ఛత్తీస్‌గఢ్ పెవిలియన్‌ను విష్ణుదేవ్ శాయి సందర్శించారు. ఆ రాష్ట్రం నుంచి మేళాకు వెళ్ళే యాత్రికులు ఉచితంగా బస చేయడానికి ఆ పెవిలియన్‌ను ఏర్పాటు చేసారు. సతీ సమేతంగా పవిత్ర స్నానం ఆచరించిన విష్ణుదేవ్ శాయి, తమ రాష్ట్రానికి చెందిన మూడు కోట్ల ప్రజల సంక్షేమం కోసం దైవాన్ని ప్రార్థించినట్లు చెప్పారు. మూడు పవిత్ర నదుల సంగమ క్షేత్రంలో జరుగుతున్న మహాకుంభమేళా సనాతన ధర్మపు దైవిక శక్తిని చాటే గొప్ప ఆధ్యాత్మిక ఉత్సవమని ఆయన వ్యాఖ్యానించారు.
ఫిబ్రవరి 12 నాటికి మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 48కోట్ల 29లక్షలు దాటిందని ఉత్తరప్రదేశ్ అధికారులు ప్రకటించారు. ప్రపంచంలో అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 మహాశివరాత్రి నాడు ముగుస్తుంది.