షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో ఒకటైన స్వామిమలై స్వామినాథ స్వామిని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. దక్షిణ భారతదేశ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామినాథ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన కంద షష్టి కవచ పారాయణంలో పాల్గొన్నారు. పవన్ వెంట ఆయన కుమారుడు అకీరా నందన్, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి ఉన్నారు.
స్వామినాథ స్వామి దర్శనానంతరం ఆదిదంపతులు శ్రీ సుందరేశ్వరన్ స్వామి, మీనాక్షి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత కుంభకోణంలోని శ్రీ ఆది కుంభేశ్వరుడిని దర్శించారు. అమృత భాంఢం(కూజా) ఆకారంలో ఉన్న శివలింగ విశిష్టతను పవన్ కళ్యాణ్ కు అర్చకులు వివరించారు.
ఆది కుంభేశ్వరాలయంలో స్వామి వారికి ఎడమవైపు వెలసిన పార్వతీదేవి అవతారం శ్రీ మంగళనాయకి అమ్మాన్ ను అమ్మవారిని మంత్రపీఠేశ్వరిగానూ కొలుస్తారు. 72 కోట్ల మంత్రాల శక్తి అమ్మవారిలో నిక్షిప్తమై ఉండడం వల్ల అమ్మవారికి ఆ పేరు వచ్చింది. అమ్మవారి దర్శనానంతరం పవన్ కళ్యాణ్ ప్రధాన ఆలయానికి నైరుతి దిశలో ఉన్న ధ్యానపీఠాన్ని సందర్శించారు.
నాలుగేళ్లగా శ్రీ అగస్త్య మహాముని ఆలయం, స్వామిమలై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్ర దర్శనం కోసం వేచి చూస్తున్నానని, ఇప్పటికి ఆ మురుగన్ అనుగ్రహం లభించిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆధ్యాత్మిక యాత్రకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు తమిళనాడు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.