భాగ్యనగర్ టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో నటరాజ్ నగర్లో గంగాబౌలి క్రాస్ రోడ్ దగ్గర ఉన్న సంకట విమోచన హనుమాన్ ఆలయంలో శివలింగం చుట్టూ మాంసం ముద్దలు పడవేసిన సంఘటన వెలుగు చూసింది. అయితే ఆ ఘటన మనుషులు చేసినది కాదని, ఒక పిల్లి మాంసం ముద్దలు తెచ్చి పడేసిందనీ పోలీసులు చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా ఆ విషయం తేలిందని వారు వివరించారు.
బుధవారం తెల్లవారుజామున దేవాలయానికి వెళ్ళిన స్థానిక భక్తులు శివలింగం చుట్టూ మాంసం ముద్దలు పడి ఉండడాన్ని గమనించి ఆందోళన చెందారు. మతపరంగా ఉద్రిక్తతలు పెంచడం కోసం ఎవరో ఇలాంటి పనికి పాల్పడి ఉంటారనే అనుమానాలతో ప్రజలు ఆగ్రహించారు. దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ పోలీసులను డిమాండ్ చేసారు.
విషయం తెలిసిన టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎ రాములు బుధవారం ఉదయం 8.20కి తన బృందంతో ఆలయం దగ్గరకు చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో ఏసీపీ, అదనపు డీసీపీ, డీసీపీ వంటి ఉన్నతాధికారులు కూడా గుడిని దర్శించారు. నాలుగు బృందాలను ఏర్పాటు చేసి, గుడి చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను విశ్లేషించే పని మొదలుపెట్టారు.
పోలీసుల దర్యాప్తులో గుడి ఆవరణలోని ఒక సీసీ కెమెరాలో ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు లభించాయి. ఒక పిల్లి నోట్లో మాంసం ముద్దతో గుడిలోకి ప్రవేశించడం, ఆ మాంసాన్ని శివలింగం వెనక పెట్టడం సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. దాంతో గుడిలో మాంసం ముద్దలు పిల్లి పనే అని నిర్ధారణ అయింది. సిటీ సౌత్‌వెస్ట్ జోన్ డీసీపీ ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన విడుదల చేసారు. ఈ సంఘటన గురించి ఎలాంటి పుకార్లూ వ్యాప్తి చేయకుండా సహనం వహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
గత యేడాది వ్యవధిలో జంటనగరాల్లో హిందూ దేవాలయాలను లక్ష్యం చేసుకుని పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని సందర్భాల్లో పోలీసులు కొందరు వ్యక్తులను అరెస్ట్ చేసారు. అయితే మానసికంగా స్థిరత్వం లేని ఉన్మాదులు చేసిన పనులు మాత్రమే తప్ప ఉద్దేశపూర్వకంగా చేసిన ద్వేషచర్యలు కావంటూ ఆ సంఘటనల తీవ్రతను తగ్గించి చూపారు. నిజానికి హైదరాబాద్‌లో హిందువులను రెచ్చగొట్టడానికి దేవాలయాలపై దాడులు చేయడం, విగ్రహాలను ధ్వంసం చేయడం అనే పద్ధతిని హైందవేతరులు పలుమార్లు అనుసరించిన చరిత్ర ఉంది. ఈమధ్య అటువంటి విద్వేషపూరిత చర్యలు పెరిగాయి కూడా.
భాగ్యనగరంలో సమీప గతంలో రక్షాపురంలో భూలక్ష్మి ఆలయం, శివాజీ నగర్లో మాతాజీ మందిరం, అంబర్‌పేటలో అమ్మవారి గుడి, సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ గుడులపై దాడులు జరిగాయి. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసారు.
ఈ దాడుల నేపథ్యంలో ఇటీవలే విశ్వహిందూ పరిషత్ తెలంగాణ బృందం భాగ్యనగర్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్‌ను కలిసారు. జంటనగరాల్లోని వివిధ ప్రాంతాల్లో హిందూ దేవాలయాల మీద జరిగిన దాడులపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలనీ విజ్ఞప్తి చేస్తూ మెమొరాండం అందజేసారు.