తిరుపతిలో అలిపిరి సమీపంలో నిర్మిస్తోన్న ముంతాజ్ ఫైవ్‌స్టార్ హోటల్‌ను కొత్తగా ఏర్పడిన టీటీడీ బోర్డు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని భావించిన టీటీడీ బోర్డు ఆ హోటల్‌కు కేటాయించిన 20 ఎకరాల స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరతామని చేస్తామని తెలిపింది. అయితే, ముంతాజ్ హోటల్ మాత్రం నిర్మాణ పనులను ఆపలేదని, రహస్యంగా పనులు జరుపుతోందని ఆరోపిస్తూ పలు హిందూ సంఘాల నాయకులు, స్వామీజీలు తుడా కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ముంతాజ్ హోటల్‌కు కేటాయించిన స్థలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీవారి పవిత్రతకు భగ్నం కలిగించే నిర్మాణాలపై తక్షణం తుడా అధికారులు చర్యలు తీసుకోవాలని.. లేని పక్షంలో హిందూ ధార్మిక సంఘాలు ఆందోళన ఉధృతం చేస్తాయని హెచ్చరించారు.
హిందువుల పుణ్యక్షేత్రంలో పర్యాటకం పేరిట కూటమి ప్రభుత్వం ముంతాజ్ హోటల్ పేరు మార్చి స్థలం కేటాయించడంపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. అలిపిరిలో టిటిడి భవనం ఎదుటే ముంతాజ్ హోటల్‌కు స్థలం కేటాయించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆ చర్యను ఖండిస్తూ పలువురు స్వాధుసంతులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
టీటీడీ పాలక మండలి సమావేశం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినా.. ప్రభుత్వం మాత్రం స్థలాన్ని కేటాయించింది. ముంతాజ్ హోటల్‌కు కేటాయించిన స్థలం వెనక్కి తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి నేతృత్వంలో పలువురు స్వామీజీలు ఆమరణ నిరాహార దీక్ష దిగారు.