పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నేడు రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC) నివేదికను బీజేపీ ఎంపి మేధా కులకర్ణి ప్రవేశపెట్టారు. మరోవైపు లోక్‌సభలో గందరగోళం నెలకొనడంతో కార్యకలాపాలను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. కేవలం ఐదు నిమిషాల పాటు మాత్రమే సభ జరిగింది.
రాజ్యసభలో జేపీసీ నివేదికపై ప్రతిపక్షాల ప్రశ్నలకు కిరణ్ రిజిజు సహా పలువురు మంత్రులు సమాధానమిచ్చారు. ప్రతిపక్షాలు నివేదికను చదివి, స్పందించాలని హితవు పలికారు.
వక్ఫ్ బిల్లుపై జేపీసీ నివేదికను ప్రతిపక్షం అంగీకరించడంలేదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. దానిని చర్చ కోసం వెనక్కి పంపాలని ఛైర్మన్‌ను కోరారు. వక్ఫ్ బిల్లుపై ఏ పార్టీ అభిప్రాయాన్నీ పరిగణలోకి తీసుకోలేదని ఖర్గే అన్నారు.
వక్ఫ్ బిల్లుపై జేపీసీ , జనవరి 30న ముసాయిదా నివేదికను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది. కమిటీలో 16 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా 11 మంది సభ్యులు వ్యతిరేరించారు.