తండ్రీకుమారులను సజీవదహనం చేసిన కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 18న సజ్జన్ కు ఏ శిక్ష విధించాలనేది ఖరారు చేయనుంది. దోషిగా నిర్ధారణ అనంతరం కేసు విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది.
సజ్జన్ కుమార్ 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఇప్పటికే జీవితఖైదు అనుభవిస్తున్నారు. ఆ అల్లర్ల సమయంలో దిల్లీలోని సరస్వతి నగర్లో తండ్రీకొడుకులు ఇద్దరినీ తగులబెట్టి సజీవదహనం చేశారు. 1984 నవంబర్ 1న జశ్వంత్ సింగ్, తరుణ్‌దీప్ సింగ్ అనే ఇద్దరు తండ్రీకొడుకులను సజీవదహనం చేసిన కేసు విచారణలో సజ్జన్ కుమార్ దోషిగా తేలాడు. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఆదేశాలు జారీచేశారు. విచారణ సందర్భంగా సజ్జన్ కుమార్‌ను తీహార్ జైలు నుంచి తీసుకొచ్చి కోర్టులో హాజరుపర్చారు.
1984 అక్టోబర్ 31న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు ప్రతీకారంగా సిక్కులపై మూకదాడి జరిగింది. ఈ దారుణంలో సజ్జన్ కుమార్ కేవలం ఒక సభ్యుడిగా మాత్రమే పరిమితం కాలేదని, సంబంధిత అల్లరిమూకకు నాయకత్వం వహించాడని వ్యాఖ్యానించింది.