ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేటినుంచీ దక్షిణ భారతదేశ ఆలయాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ ఉదయం చొట్టనిక్కరలోని అగస్త్య మహర్షి ఆలయానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్‌తో పాటు కొడుకు అకిరా నందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు. అగస్త్య ఆలయం ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు డాక్టర్ యోగిదాస్, ఇతర సభ్యులు పవన్ కళ్యాణ్‌కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం అగస్త్య మహర్షికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేసారు. ఆలయ ఆవరణలోని ఇతర మహా ఋషుల ఆలయాలను దర్శించుకున్నారు.
ఆలయ సందర్శన అనంతరం అగస్త్య ఆశ్రమంలో ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే మూలికలు, మొక్కలను పవన్ కళ్యాణ్ పరికించారు. ఆ తరవాత ఆశ్రమంలోని గోశాలను సందర్శించారు.
చివరిగా పవన్ కళ్యాణ్ ఆశ్రమంలోని ఆయుర్వేద చికిత్సాలయాన్ని సందర్శించారు. తనను దీర్ఘకాలంగా బాధిస్తున్న నడుము నొప్పి, స్పాండిలైటిస్ సమస్యకు ఆయుర్వేదంలో చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. అగస్త్య ఆశ్రమంలో చికిత్స కోసం దూరప్రాంతాల నుంచి రోజూ 200 మందికి పైగా వస్తుంటారు. అక్కడ 100 పడకల ప్రత్యేక వైద్యశాల ఉంది. దానిలో 12 మంది వైద్యులు, ఇతర సిబ్బంది పని చేస్తుంటారు.
ఆలయ సందర్శన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ‘‘తిరుమల బాలాజీకి దేశవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఉన్నారు. వారి మనోభావాలు గాయపడకూడదు. తిరుమల లడ్డూలో కల్తీ జరగడం దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు మళ్ళీ భవిష్యత్తులో జరగకూడదు. లడ్డూ కల్తీ వ్యవహారంలో పాత్రధారుల అరెస్టు కేసు దర్యాప్తులో భాగం. సంతోషించదగిన విషయం. భవిష్యత్తులోనూ టిటిడి విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రసాదాల్లోనూ, ఇతర వ్యవహారాల్లోనూ తగు జాగ్రత్తలు పాటించాలి’’ అని చెప్పారు.
దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన తన వ్యక్తిగత అంశమని, దానికీ రాజకీయాలకూ సంబంధం లేదనీ పవన్ కళ్యాణ్ చెప్పారు. సుమారు నాలుగున్నర సంవత్సరాల క్రితం చెల్లించుకోవలసిన మొక్కుల కోసం ఆరోగ్యం సహకరించకపోయినా రావలసి వచ్చిందన్నారు. కేరళ, తమిళనాడులోని ఆలయాలను దర్శించుకుంటున్నానని చెప్పారు. పోలీసులు పట్టుకుంటున్న ఎర్ర చందనం అమ్మకం విషయంలో దేశం మొత్తానికి నూతన విధానం తీసుకురావాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు.