ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీయే ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. 16,247 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపిది. జూన్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని ప్రకటనలో వివరించింది.
మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్న విద్యాశాఖ న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. మొత్తం 16,247 ఉపాధ్యాయ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్లు – 7,725, సెకండరీ గ్రేడ్ టీచర్లు – 6,371, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ – 1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్- 286, వ్యాయామ ఉపాధ్యాయులు – 132, ప్రిన్సిపాల్స్- 52 పోస్టులు ఉన్నాయి.
గతంలో ఉపాధ్యాయులకు 45 రకాల యాప్ లు ఉండేవని, వాటన్నింటినీ కలిపి ఒకే యాప్ గా మార్చేశామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. త్వరలో ఉపాధ్యాయ బదిలీల చట్టం తేనున్నట్లు వెల్లడించారు.వీసీల నియామకం పూర్తయ్యాక అన్ని విశ్వవిద్యాలయాలకు ఏకీకృత చట్టం అమలు చేస్తామన్నారు.