ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ త్రివేణీసంగమం దగ్గర జరుగుతున్న మహాకుంభమేళాలో ఇవాళ మాఘపూర్ణిమ పర్వదినం నాడు భక్తులు ‘అమృత స్నానాలు’ ఆచరిస్తున్నారు. కుంభమేళా సందర్భంగా భక్తులు చేపట్టే కల్పవాస దీక్ష నేటితో ముగుస్తుంది.
కుంభమేళా గురించి ‘జల మహిళ’ శిప్రా పాఠక్ చెబుతూ ‘‘ఇది కేవలం ఆచారం కోసం చేసే స్నానం మాత్రమే కాదు. ఆధ్యాత్మిక సాధన, సేవ, సమన్వయాల కోసం చేసే ఆత్మిక ప్రయాణమే కుంభమేళా’’ అని వివరించారు.
శిప్రా పాఠక్ ఈ యేడాది కల్పవాస దీక్ష కూడా చేపట్టారు. ‘‘కల్పవాసీలు తమకు పుణ్యం సంపాదించుకోడానికి, విముక్తి సాధించడానికి మాత్రమే ఈ దీక్ష తీసుకుని కుంభమేళాకు రారు. తోటి భక్తులకు సహాయం చేయడం కూడా వారి ప్రధానమైన లక్ష్యం. కల్పవాసదీక్ష చేపట్టిన వారు నేల మీదనే పరుండాలి. శీతాకాలపు చలిని, వేసవి వేడినీ రెండింటినీ సమానంగా భరించగలగాలి. ఆ విధంగా చేసే తపస్సు మనకు జీవితంలోని సమస్యలను సహనం, అంకిత భావంతో ఎదుర్కొనే నేర్పును ఇస్తుంది. అది కేవలం ఒక దీక్ష కాదు, ఒక జీవిన విధానం. జీవితంలో ఎన్నిక కష్టసుఖాలు వచ్చినా మనం స్థిరంగా ఉండాలి, అన్నింటినీ స్థితప్రజ్ఞతతో ఒకేలా తీసుకోవాలి అని మనకు అనుక్షణం గుర్తు చేసే జీవిత విధానమే కల్పవాస దీక్ష’’ అని వివరించారు. కల్పవాస దీక్ష సమయంలో అవలంబించే హఠయోగం, మనకు ఎదురయ్యే సవాళ్ళను మన మనసు సహజంగా స్వీకరించేలా మన శరీరాన్ని సంసిద్ధం చేస్తుంది అని శిప్రా పాఠక్ వివరించారు.
మహాకుంభమేళా 2025 తత్వాన్ని ఆమె వివరిస్తూ, ‘‘ఒక వ్యక్తి తన వ్యక్తిగత స్వార్థాన్ని విడిచిపెట్టి, విముక్తి మార్గంలో పయనిస్తూ, తోటివారికి నిస్వార్థంగా సేవ చేయడమే మహాకుంభమేళా ఆంతర్యం’’ అని వివరించారు.
శిప్రా పాఠక్ తన కల్పవాస దీక్ష సందర్భంగా ‘‘సహాయ అర్చకులు, ఆచార్యులు, సాధకులు, సాధుసంతులు, దుకాణ దారులు, పారిశుధ్య కార్మికులు అందరినీ గౌరవించడమే కుంభమేళా ఆదర్శం’’ అంటూ వారికి తగిన విధంగా గౌరవించుకున్నారు. వారందరికీ ఆహారం తానే స్వయంగా వండి వడ్డించారు. కుంభమేళాలో సైతం కల్పవాసులు తమ ఆహారం తామే వండుకుని తినడమూ ఓ సంప్రదాయం.
శిప్రా పాఠక్ కల్పవాస దీక్షతో పాటు మహాకుంభమేళాలో పారిశుధ్యం గురించి ప్రచారం చేస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలంటూ ‘ఏక్ థైలా, ఏక్ థాలీ’ అనే నినాదంతో ముందుకు వెడుతున్నారు. త్రివేణీ సంగమాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం కోసం ఆమె ఇప్పటివరకూ పేపర్తో చేసిన 15లక్షల ప్లేట్లు, 16లక్షల సంచులు, 4లక్షల గ్లాసులు పంపిణీ చేసారు. ప్లాస్టిక్, పాలిథీన్ సంచుల వాడకాన్ని వీలైనంత వరకూ మానేయాలంటూ ఆమె భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.