బెంగళూరులో జరుగుతున్న ఏరోఇండియా 2025 ప్రదర్శనలో నాలుగు ప్రముఖ ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ తెలిపారు. ఆ ఒప్పందాల వల్ల రూ.2,458.84 కోట్ల పెట్టుబడి రావచ్చన్నారు. 8వేలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే అవకాశం ఉందన్నారు.
సముద్ర రక్షణ, మానవరహిత ఉపరితల వాహన సాంకేతికతలలో అగ్రగామి అయిన సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, రక్షణ తయారీలో కీలకమైన హెచ్‌ఎఫ్‌సీఎల్, స్పేస్ టెక్నాలజీ కాంపోనెంట్స్‌లో ప్రత్యేకత కలిగిన మీడియా మ్యాట్రిక్స్ వరల్డ్‌వైడ్ లిమిటెడ్ కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది. సోమవారం రాత్రి బెంగుళూరులో మంత్రి టి.జి భరత్ సమక్షంలో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఆ కార్యక్రమంలో రాష్ట్రప్రభుత్వ పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్, ఇతర సీనియర్ అధికారులు, ఆయా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎంఓయూలు కుదుర్చుకున్న సందర్భంగా మంత్రి భరత్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులు స్వదేశీ రక్షణ వ్యవస్థల తయారీని పెంచుతాయన్నారు. రక్షణ రంగంలో తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందన్నారు.
ఈ పెట్టుబడుల వల్ల ఆంధ్రప్రదేశ్ మన దేశంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తయారీకి ప్రధాన గమ్యస్థానంగా మారగలదని మంత్రి ఆశాభావం వ్యక్తం చేసారు.