దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ సిద్దాంతాన్ని ప్రతిపాదించిన మహోన్నత వ్యక్తి అని బిజెపి నేతలు ప్రస్తుతించారు. ఇవాళ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వర్థంతి సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించారు.
ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ తొలుత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్‌గా పనిచేసారని గుర్తు చేసారు. కాలక్రమంలో రాజకీయ క్షేత్రం లోకి వచ్చిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ బిజెపి సిద్ధాంతకర్తగా నిలిచారని వాకాటి తెలియజేసారు. సమాజంలో అట్టడుగున ఉండే వ్యక్తి వరకూ ప్రభుత్వ సేవల ఫలాలు అందాలని చెప్పే ‘అంత్యోదయ’ సిద్ధాంతాన్ని దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించారని వివరించారు. దీన్‌దయాళ్‌జీ ఆలోచనలనే నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్నారని చెప్పారు. దాని ఫలితంగానే ఇవాళ బిజెపి 21 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ మహనీయుడి స్ఫూర్తితోనే బిజెపి శ్రేణులు నేటికీ పనిచేస్తున్నాయని వాకాటి నారాయణరావు అన్నారు.
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ సంస్మరణ సభలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, అనంతపురం జిల్లా అధ్యక్షుడు కె రాజేష్ తదితరులు పాల్గొన్నారు.