తమిళనాడులోని ఒక ప్రఖ్యాత ఆలయం ఈఓ ఇటీవల ఒక వివాదాస్పద ఉత్తర్వు జారీచేసారు. దానిపై హిందూ సమాజం నుంచి, భక్తులూ అర్చకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో ఈఓ తన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవలసి వచ్చింది. ఇది హిందూ భక్తుల, అర్చకుల విశేషమైన విజయంగా నిలిచింది.
మదురైలోని అరుళ్మిగు దండాయుధపాణి స్వామి దేవాలయానికి విశేషమైన భక్తజన ఆదరణ ఉంది. ఫిబ్రవరి 7న ఆ దేవాలయం ఎగ్జిక్యూటివ్ అధికారి ఒక ఉత్తర్వు జారీ చేసారు. దాని ప్రకారం గుడిలోని హారతిపళ్ళెంలో భక్తులు వేసే దక్షిణలను పూజారులు తీసుకోకూడదు, ఆ నగదును దేవాలయం హుండీలో వేసేయాలి. ఆ ఆదేశాలను భక్తులు, కార్యకర్తలు, హిందూ సంస్థలు తీవ్రంగా నిరసించారు. అర్చకులకు ఇస్తున్న జీతభత్యాలే నామమాత్రంగా ఉంటాయి. వారికి భక్తులు తమ శ్రద్ధాభక్తులతో సమర్పించుకునే చిన్నపాటి దక్షిణలను సైతం లాగేసుకోవాలని ప్రభుత్వం భావించడం అనుచితం. అది ఆలయాల్లోని సంప్రదాయ ఆచారాల్లో జోక్యం చేసుకోవడమే. ఆ ఉత్తర్వులు అర్చకులకు ఆవేదన కలిగించడం మాత్రమే కాదు, హిందూ సమాజాన్ని ఆగ్రహానికి గురిచేసింది.
సాధారణంగా ఏ గుడిలోనైనా హారతి పళ్ళెంలో భక్తులు దక్షిణ రూపంగా వేసే డబ్బులను అర్చకులు స్వీకరిస్తారు. అయితే పూజారులు అలా హారతి పళ్ళెం డబ్బులను తీసుకోకూడదంటూ ఫిబ్రవరి 7న సర్క్యులర్ జారీ చేసారు. అంతేకాదు. హారతి పళ్ళెం డబ్బులను హుండీలో వేసేయడంలో విఫలమైన అర్చకులపై తగిన చర్యలు తీసుకుంటామంటూ ఎగ్జిక్యూటివ్ అధికారి తన ఆదేశాల్లో హెచ్చరించారు. ఆ చర్యపై వెంటనే హిందూ సమాజంలో ఆగ్రహావేశాలు రగిలాయి. భక్తులు ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో వేసే దక్షిణల నుంచి ప్రభుత్వ అధికారులకు భారీ మొత్తంలో దోచిపెడుతున్న దేవదాయ శాఖ, ధార్మిక సంప్రదాయాల్లో జోక్యం చేసుకుంటోందని, నామమాత్రపు వేతనాలతో కునారిల్లే పూజారులను దుర్మార్గులుగా, నేరస్తులుగా చిత్రీకరిస్తూ వారిని అణగదొక్కేయడానికి ప్రయత్నిస్తోందనీ భక్తులు మండిపడ్డారు.
దండాయుధపాణి దేవాలయం ఈఓ ఆదేశాల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ ఆలయాల హక్కుల ప్రచారకర్త టిఆర్ రమేష్, ఇతర హిందూ కార్యకర్తలు సవాల్ చేసారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దేవాలయాల్లో ఈఓలు, జేసీల నియామకాలే చట్టవిరుద్ధమని వారు వాదించారు. అలాంటి ఈఓ ఆదేశాలతో ప్రభావితమైన భక్తులూ అర్చకులూ ఫిర్యాదు చేయాలని, సదరు ఈఓ ఆదేశాలపై ఇంజంక్షన్ కోరుతూ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేయాలనీ వారు సూచించారు. చట్టబద్ధత లేని అలాంటి పనులకు పాల్పడకుండా దేవదాయ శాఖను నిరోధించాలని హైకోర్టు బెంచ్‌ను కోరాల్సిందిగా వారు సిఫారసు చేసారు.
ఆ పరిణామాలతో అరుళ్మిగు దండాయుధపాణి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి దిగివచ్చారు. హారతి పళ్ళెం డబ్బులను పూజారులు తీసుకోకూడదని, వాటిని హుండీల్లో జమ చేయాలనీ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు. ఇది తమిళనాడులోని హిందూ భక్తులకు భారీ విజయమే.
తమిళనాడు దేవదాయ శాఖ పనితీరు:
తమిళనాడు రాష్ట్రంలో 40వేలకు పైగా దేవాలయాలు దేవదాయ శాఖ పరిధిలో ఉన్నాయి. అయితే దేవదాయ శాఖ తరచుగా తప్పుడు నిర్వహణా పద్ధతులు, ఆగమ సంప్రదాయాల్లో జోక్యం చేసుకోవడం, దేవాలయాల ఆర్థిక వనరులను దోచుకోవడం వంటి చర్యల కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
తమిళనాడు దేవదాయ శాఖ పనితీరు మీద ఎన్నో విమర్శలున్నాయి. అవేంటంటే….
(1) దేవాలయాల ఆస్తులను హిందూయేతరులకు నామమాత్రపు అద్దెలకు లీజుకి కట్టబెట్టడం, ఆ నామమాత్రపు అద్దెలు సైతం కోట్లకు చేరుతున్నా వాటిని వసూలు చేయకపోవడం
(2) దేవాలయాల నిర్వహణను నిర్లక్ష్యం చేయడం, గుడుల మరమ్మతులు, పునరుద్ధరణకు నిధులను ఉపయోగించకపోవడం
(3) అర్చకులకు తగుమాత్రం వేతనాలు ఇవ్వకపోవడం, ఆలయ ఆదాయాన్ని మాత్రం నిర్వహణా ఖర్చులు, విలాసవంతమైన వాహనాలకు ఖర్చుపెట్టడం
(4) దర్శనం, అభిషేకం, ఇతర ఆర్జిత సేవల పేరుతో భక్తుల నుంచి అనవసరమైన రుసుములు వసూలు చేయడం, దేవాలయాన్ని దర్శించుకోవాలంటే ఖర్చులకు భక్తులు భయపడేలా చేయడం
(5) దేవాలయ ఆవరణల్లో, పరిసరాల్లో ఇతర మతాల వారికి, నాస్తికులకు దుకాణాలు ఏర్పాటు చేసుకోడానికి అనుమతులు ఇవ్వడం, ఆలయ ఆస్తుల ఆక్రమణలకు దారి కల్పించడం
…ఇటువంటి విధానాల ద్వారా హిందూ దేవాలయ సంప్రదాయాలను బలహీన పరచడానికి, ఆలయాల సాంస్కృతిక అస్తిత్వాన్ని నశింపజేయడానికీ దేవదాయ శాఖ నిరంతరాయంగా పనిచేస్తోందని హిందూ సంస్థలు భావిస్తున్నాయి. దేవాలయాల నిధులను వాణిజ్య నిర్మాణాలు చేయడానికి వాడాలని దేవదాయ శాఖ గతంలో నిర్ణయించింది. అదృష్టవశాత్తు మద్రాసు హైకోర్టు ఆ నిర్ణయంపై స్టే విధించింది. అలాంటి చర్యల ద్వారా దేవదాయ శాఖ హిందూ భక్తుల్లో ఆందోళన కలగజేస్తోంది.
దేవదాయ శాఖ తాజా చర్యలు:
పూజారులకు హారతిపళ్ళెం డబ్బులపై ఆంక్షలు విధించాలన్న దండాయుధపాణి ఆలయం ఈఓ ఆదేశాలు ఒకేఒక సంఘటన కాదు. గత అక్టోబర్‌లో దేవదాయ శాఖ కొడైకెనాల్లోని కుళందై వేలప్పర్ గుడిలోనూ అటువంటి ఆదేశాలే జారీచేసింది. భక్తులు ఇచ్చే అన్ని కానుకలనూ దేవాలయం బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. దాన్ని అమలు చేయడం కోసం గుడినిండా సీసీటీవీ కెమెరాలు పెట్టింది. పూజారులు కానుకలను ‘దొంగతనం చేయకుండా’ వారిని పర్యవేక్షించడానికి ముగ్గురు అధికారులను సైతం నియమించింది.
ఇలాంటి చర్యల ద్వారా గుడులంటే భక్తులకు చిరాకు పుట్టించి వారు దేవాలయాలకు రాకుండా చేయాలని, అలాంటి ఆంక్షలేమీ లేని ఇతర మతాల ప్రార్థనాస్థలాలకు వారిని తరలించాలన్నదే దేవదాయ శాఖ అసలు ఉద్దేశమని విమర్శకులు మండిపడుతున్నారు. చర్చిలు మసీదుల మీద ఇలాంటి ఆర్థిక ఆంక్షలు విధించరు, కానీ గుడుల మీద మాత్రం విధిస్తారు. అసలు చర్చిలు, మసీదుల నిర్వహణ జోలికి ప్రభుత్వాలు వెళ్ళనే వెళ్ళవు. కానీ గుడుల మీద మాత్రం పెత్తనం చెలాయిస్తారు. ప్రభుత్వాల ద్వంద్వవైఖరులకు ఇదే నిదర్శనం.
ఆలయాలను ప్రభుత్వాల నుంచి విముక్తం చేయాలన్న ఉద్యమానికి ఊతం:
మదురై అరుళ్మిగు దండాయుధపాణి దేవాలయంలో ఈఓ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకునేలా చేయడం ‘దేవాలయాల విముక్తి ఉద్యమం’ సాధించిన మరో గొప్ప విజయం. ఇప్పుడు దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలను ప్రభుత్వాల కబంధ హస్తాల నుంచి విడిపించాలన్న ఉద్యమం వేగం పుంజుకుంటోంది. భక్తులు, కార్యకర్తలు ఆ దిశగా బహిరంగంగా చర్చిస్తున్నారు.
ఇటీవల తమిళనాడులోని తిరుపరంకుండ్రం మురుగన్ ఆలయాన్ని ఇస్లామీకరించే ప్రయత్నాలు కూడా హిందువుల్లో తీవ్ర అసహనాన్ని రేపాయి. వారిని ‘దేవాలయాల విముక్తి’ అనే లక్ష్యసాధన దిశగా పోరాటానికి ఉన్ముఖులను చేసాయి. తమిళనాడులోని ద్రవిడ ప్రభుత్వాలు హిందూ దేవాలయాల విషయంలో అమలు చేస్తున్న విధానాల పట్ల వ్యతిరేకత నానాటికీ పెరుగుతోంది.