రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు ప్రాంతాల్లో కోళ్ళు చనిపోవడానికి కారణం బర్డ్‌ఫ్లూ వ్యాధేనని తేలింది. ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్ (హెచ్5ఎన్1-బర్డ్‌ఫ్లూ) సోకడం వల్లనే కోళ్ళు మరణించాయని నిర్ధారణ అయింది.
వివిధ ప్రాంతాల్లో చనిపోయిన కోళ్ళ నుంచి నమూనాలు సేకరించి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ సంస్థకు పంపించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఉన్న ఆ సంస్థ ప్రయోగశాలల్లో నమూనాలను పరీక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు, తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు గ్రామాల నుంచి పంపించిన నమూనాల్లో వైరస్ ఉన్నట్లు ఆ పరీక్షల్లో నిర్ధారణ అయింది.
బర్డ్‌ఫ్లూ ఉందని తెలియడంతో పశుసంవర్ధక శాఖ అధికారులు ఆ రెండు కోళ్ళ ఫారాల్లో చనిపోయిన కోళ్ళను పూడ్పించారు. కిలోమీటరు పరిధి వరకూ రెడ్ అలర్ట్ ప్రకటించారు. పరిసర ప్రాంతాల్లో వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకున్నారు. రెడ్‌జోన్‌లో 10, సర్వెయిలెన్స్ జోన్‌లో మరో 10 బృందాలతో నిరంతర పర్యవేక్షణ జరుగుతోంది.
ఈ వ్యవహారంపై రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు స్పందించారు. బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన రెండు కోళ్ళ ఫారాల్లోని కోళ్ళు, గుడ్లను పూడ్చిపెట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలియజేసారు. ఆ రెండు ఫారాల చుట్టూ కిలోమీటరు పరిధిలో రెడ్ అలర్ట్ ప్రకటించామనీ, అక్కడ మాత్రమే చికెన్ దుకాణాలు మూసివేయాలని ఆదేశించామనీ వివరించారు. రాష్ట్రంలో మరెక్కడా సమస్య లేదని స్పష్టం చేసారు.