తెలంగాణలోని చిలుకూరు బాలాజీ గుడి ప్రధానార్చకులు రంగరాజన్‌పై దాడి చేసిన దుండగులను పోలీసులు అరెస్ట్ చేసారు. తమకు ఆర్థికంగా సహాయం చేయాలని డిమాండ్ చేసి, దానికి ఆయన ఒప్పుకోకపోవడంతోనే నిందితులు రంగరాజన్‌పై భౌతిక దాడికి పాల్పడ్డారని పోలీసులు వివరించారు.
దాడి ఘటనపై రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ ప్రకటన చేస్తూ ప్రధాన నిందితుడు వీరరాఘవ రెడ్డి, ఇద్దరు మహిళలు సహా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసామని వెల్లడించారు. సోమవారం ఉదయం ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు.
ప్రధాన నిందితుడు వీరరాఘవ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందినవాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మణికొండలో నివసిస్తున్నాడు. 2022లో అతను రామరాజ్యం అనే సంస్థను ప్రారంభించాడు. ఆ సంస్థలో చేరిన వారికి రూ.20వేలు జీతం ఇస్తానని ప్రకటనలు చేసాడు. ఆంధ్రప్రదేశ్‌లోని తణుకు, కోటప్పకొండ ప్రాంతాల్లో పర్యటించి కొంతమందిని సభ్యులుగా చేర్చుకున్నాడు. ఈ నెల 7వ తేదీన వీరరాఘవరెడ్డి తన అనుచరులతో కలిసి మూడు వాహనాల్లో చిలుకూరు వెళ్ళాడు. అక్కడ వారు బాలాజీ గుడి ప్రధానార్చకులు రంగరాజన్‌ను కలిసారు. తమ సంస్థలో సభ్యులను చేర్పించాలనీ, ఆర్థికంగా సహాయం చేయాలనీ డిమాండ్ చేసారు. దానికి ఆయన ఒప్పుకోకపోవడంతో ఆయనపై దాడికి పాల్పడ్డారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ సంఘటన గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాకబు చేసారు. సోమవారం నాడు రంగరాజన్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. ఇలాంటి దాడులను సహించే ప్రసక్తే లేదన్నారు. దుండగులపై కఠినచర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. సీఎం సూచనల మేరకు తెలంగాణ దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ చిలుకూరు వెళ్ళారు. రంగరాజన్‌ను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున అర్చకులు రంగరాజన్‌కు అండగా ఉంటామన్నారు.
కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి చిలుకూరు ఘటనను తీవ్రంగా ఖండించారు. రంగరాజన్ విద్యాధికులని, ఉన్నతస్థాయి పదవులను సైతం పరిత్యజించారనీ గుర్తు చేసుకున్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నత ధార్మిక విలువలను పాటిస్తున్నారని తెలియజేసారు. అలాంటి గౌరవప్రదమైన అర్చకవృత్తిలో ఉన్న వ్యక్తిపై జరిగిన దాడి గర్హనీయం, దురదృష్టకరం, బాధాకరం అని కిషన్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావు లేదని, దౌర్జన్యాలూ బెదిరింపులకు స్థానం లేదనీ అన్నారు. చిలుకూరు ఘటన ఒక వ్యక్తి మీద కాదు, సనాతన ధర్మం మీద జరిగిన దాడి అని అభిప్రాయపడ్డారు.