తెలంగాణలోని చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధానార్చకులు రంగరాజన్‌పై కొందరు మూర్ఖులు చేసిన దాడిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తీవ్రంగా ఖండించింది. దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రంగరాజన్‌పై దాడి అర్చక వ్యవస్థ మీద, మొత్తంగా హిందూ సమాజం మీద జరిగిన దాడిగా ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది.
ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రముఖ్ కట్టరాజు గోపాల్ ఈ సంఘటనపై ఒక ప్రకటన విడుదల చేసారు.
‘‘చిలుకూరు దేవాలయం ప్రధానార్చకులు శ్రీ రంగరాజన్ గారిపై ఇటీవల జరిగిన దాడి ఘటనను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తీవ్రంగా ఖండిస్తున్నది. శ్రీ రంగరాజన్ గారి మీద అమానుష దాడికి పాల్పడిన వారిపై లోతైన దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాము. దేవాలయ పరిరక్షణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రంగరాజన్ గారిపై జరిగిన దాడి కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడిగా భావించరాదు. సామాజిక విలువలు, సనాతన ధర్మంతో ముడిపడిన అర్చక-దేవాలయ వ్యవస్థ పైన, మొత్తంగా హిందూ సమాజంపైనే జరిగిన దాడిగా ఆర్ఎస్ఎస్ భావిస్తున్నది. సామాజిక సమరసత కోసం కృషి చేస్తున్న శ్రీ రంగరాజన్ గారిపై దాడి ఎంతమాత్రం క్షమార్హం కాదు.
సమాజంలోని వ్యక్తులు, వ్యవస్థలు రాజ్యాంగం పరిధిలో ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకున్నప్పుడు మాత్రమే మానవతా విలువలతో కూడిన పటిష్టమైన సమాజాన్ని నిర్మించుకోగలుగుతాము. ధర్మ పరిరక్షణ ముసుగులో వ్యక్తిగత ప్రయోజనం కోసం స్వార్థపూరిత చర్యలకు పాల్పడేవారిని ఎంతమాత్రం ఉపేక్షించకూడదు. ఇటువంటి వ్యక్తులే శ్రీ రంగరాజన్ గారిపై దాడి చేసారు. ఈ సంఘ విద్రోహులను చట్టప్రకారం విచారించి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవస్థలను నియంత్రించాలనుకునే నియంతృత్వ పోకడలకు పౌర సమాజంలో చోటు లేదు’’ అని ఆ ప్రకటన ద్వారా ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది.