ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ముస్తఫాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిష్త్, ఆ ప్రాంతం పేరును మార్చాలన్న తన ఉద్దేశాన్ని మరోసారి ప్రకటించారు. తాను ఆ ప్రాంతం అభివృద్ధి కోసం 1998 నుంచీ కృషి చేస్తున్నానని గుర్తు చేసారు. ముస్తఫాబాద్ పేరును శివపురి లేక శివ విహార్గా మారుస్తామని బిష్త్ వెల్లడించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మోహన్ సింగ్ బిష్త్, తన నియోజకవర్గం అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. ‘‘నా పాతికేళ్ళ అనుభవంతో నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. నేను గెలిస్తే ముస్తఫాబాద్ పేరును శివపురి లేక శివ విహార్గా మారుస్తానని ప్రచార సమయంలో చెప్పాను. నేను ఆ పని చేస్తాను’’ అని బిష్త్ అన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే రోజు నుంచే తన నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే పని మొదలుపెడతానని చెప్పారు.
ఢిల్లీలో ముస్లిములు అధికంగా ఉండే ముస్తఫాబాద్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ మోహన్ సింగ్ బిష్త్ను నిలిపింది. ఆయన ఆప్ అభ్యర్ధి అదీల్ అహ్మద్ ఖాన్ను ఓడించారు. ఢిల్లీ ఎన్నికల్లో 70కి గాను 48 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీని గద్దె దించింది. ఆ పార్టీకి చెందిన మహామహులైన నాయకులు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సౌరభ్ భరద్వాజ్, సత్యేంద్ర జైన్ వంటి వారందరూ ఓటమి చవిచూసారు. బీజేపీ ఇంకా తమ ముఖ్యమంత్రిని ప్రకటించాల్సి ఉంది.