ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులను వేగంగా విచారించి, శిక్షలు ఖరారు చేసి, వారు జీవిత కాలంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలంటూ అశ్విని ఉపాధ్యాయ్ 2016లో దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాఖ్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.అమికస్ క్యూరీ హన్సారియా సమర్పించిన నివేదికను కూడా ధర్మాసనం పరిశీలించింది.
ప్రస్తుత లోక్‌సభలో 40 మంది ఎంపీలపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయని అమికస్ క్యూరీ హన్సారియా తన నివేదికలో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల విచారణ ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించినా కొన్ని రాష్ట్రాల్లో ఇంత వరకు అమలు కాలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది.
క్రిమినల్ కేసులు ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకే అనర్హులు అవుతారు. మరి ప్రజాప్రతినిధులుగా ఎలా చేస్తున్నారంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై ఎన్నికల సంఘం దృష్టి సారించాల్సి ఉందన్నారు. కేంద్రానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి కేసు విచారణ మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది.