దేవాలయం వెర్సెస్ దర్గా : వలస పాలన కాలపు సంఘర్షణ
తిరుపరంకుండ్రం కొండ యాజమాన్యం గురించి ఘర్షణలు 1900ల తొలినాళ్ళలోనే మొదలయ్యాయి. తిరుపరంకుండ్రం కొండపై యాజమాన్యం కోసం మదురై మీనాక్షి ఆలయ దేవస్థానంతో సికందర్ ఔలియా దర్గా నిర్వాహకులు గొడవలకు దిగడం మొదలుపెట్టారు. 1915లో దర్గా నిర్వాహకులు కొండమీద మండపం ఉన్న ప్రాంతంలో ముస్లింల కోసం రెస్ట్‌హౌస్ నిర్మాణానికి బండలు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయడంతో వివాదం ముదిరింది. కొండ ఎన్నో వందల యేళ్ళ నుంచీ హిందువుల పుణ్యక్షేత్రమనీ, అక్కడ దర్గాకు ప్రత్యేకమైన హక్కులేవీ లేవనీ వాదించి, మదురై మీనాక్షి ఆలయ దేవస్థానం వారు ముస్లిముల ప్రయత్నాలను వ్యతిరేకించారు.
మీనాక్షి ఆలయ దేవస్థానం నిర్వాహకులు మేలూరు కోర్టును ఆశ్రయించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 145 ప్రకారం కేసు పెట్టారు. 1837 జనవరి 11నాటి ఒక కైఫీయతును వారు న్యాయస్థానానికి సమర్పించారు. పాండ్యవంశపు రాజైన పరాక్రమ పాండ్యన్ తిరుపరంకుండ్రం, దాని చుట్టుపక్కల చిన్న గ్రామాలు అన్నింటినీ మదురై మీనాక్షి దేవాలయానికి ఆలయ సేవల నిమిత్తం సమర్పించారని ఆ కైఫీయతులు స్పష్టంగా చెబుతున్నాయి. దానికి వ్యతిరేకంగా ముస్లిం ప్రతివాదులు ఒక ఈనాం పత్రాన్ని తీసుకొచ్చారు. దానిలో ఆ కొండను సికందర్ దర్గా అని ప్రస్తావించారు. మసీదు నిర్వహణ కోసం కొన్ని భూములు ఈనాముగా ఇచ్చినట్లు చూపారు.
ఆ వ్యవహారంలో అప్పటి జిల్లా కలెక్టరు తీర్పు చెప్పారు. ఎలాంటి అనుమతులూ లేయకుండా కొండ మీద ముస్లిములు మండపం నిర్మించడానికి వీలులేదు, దానికోసం బండరాళ్ళను తవ్వితీయడం చట్టవిరుద్ధం అవుతుంది. తాలూకా బోర్డు నుంచి లైసెన్సు లేకుండా తిరుపరంకుండ్రం కొండ మీద ఎలాంటి ఖననాలూ చేయకూడదు అని ఆ కలెక్టరు ఆదేశించారు. ఐతే ఆ వ్యవహారం చాలా సంక్లిష్టంగా ఉందని భావించిన హైకోర్టు న్యాయవాది సిఎస్ నారాయణస్వామి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసారు. కొండ విషయంలో పాలనా పరమైన నిర్ణయాల ద్వారా కాక న్యాయమార్గాల ద్వారా సమస్యను పరిష్కరించాలని ఆయన సిఫారసు చేసారు.
న్యాయపోరాటం – ప్రీవీ కౌన్సిల్ తీర్పు:
1963లో మదురై సబార్డినేట్ జడ్జి దేవాలయానికి అనుకూలంగా తీర్పునిచ్చారు. తిరుపరంకుండ్రం కొండ మీద మసీదు ఉన్న స్థలం, దాని మెట్లమార్గం, నెల్లితోప్ వదిలేసి మిగతా మొత్తం కొండ అంతా హిందూ దేవాలయ నిర్వాహకులకే చెందుతుంది అని ఆయన తీర్పులో తేల్చి చెప్పారు.
కాలక్రమంలో ఆ కేసు లండన్‌లోని ప్రీవీ కౌన్సిల్‌కు చేరుకుంది. అప్పటి బ్రిటిష్ ఇండియాలో అప్పీలు చేసుకోగల ఉన్నత న్యాయస్థానం ప్రీవీ కౌన్సిలే. 1931 మే 12న ప్రీవీ కౌన్సిల్ సైతం గుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. తిరుపరంకుండ్రం కొండ మీద బలవంతంగా పెట్టిన మసీదు ఆ కొండ మీద ఉండే హిందువులకు బాధ కలిగిస్తుంది అని స్పష్టంగా చెప్పింది.
ప్రీవీకౌన్సిల్ గమనించిన అంశాలు:
1. ఎన్నో శతాబ్దాల నుంచి ఆ పర్వతం మీద ఆలయం ఉంది. సామాన్యశకం 1835 నాటికే దేవాలయ నిర్వహణ జరుగుతోందనడానికి ఎన్నో ఆధారాలు లభించాయి. గిరివీధికి మరమ్మతులు, మండపాల నిర్మాణం, భక్తులకు తాగునీటి వసతి కల్పించడం వంటి దేవాలయ నిర్వహణ సంబంధిత అంశాల రికార్డులు ఉన్నాయి.
2. అప్పటి ఆర్కియాలజీ విభాగం డైరెక్టర్ జనరల్ ఆ కొండ గురించి నివేదిక సమర్పించారు. అందులో ‘‘మొత్తం పర్వతాన్ని హిందువులు శివలింగంగా ఆరాధిస్తారు. ఆ విధమైన ఆరాధనా పద్ధతికి మదురై కేంద్రస్థానం’’ అని వెల్లడించారు.
3. దేవాలయాల మాన్యాలకు సంబంధించిన చారిత్రక పత్రాలు, బ్రిటిష్ కాలం నాటి రికార్డులలో ఆ కొండను ‘స్వామిమల’గా వ్యవహరించేవారు. దాన్నిబట్టి ఆ ప్రాంతం హిందువులకు ఎంతో ముఖ్యమైనదిగా ధ్రువీకరణ అయింది.
4. ఆ పర్వతాన్ని సెక్యులర్ అధికారులు తమ నిర్వహణలోకి తీసుకున్నట్లుగా ఎలాంటి చారిత్రక ఆధారాలూ లేవు.
5. మదురైని ముస్లిం నవాబులు పరిపాలించిన సమయంలో తిరుపరంకుండ్రం కొండ మీద ముస్లిములు ఇళ్ళు, మసీదు కట్టుకుని ఉండవచ్చు. కానీ అది స్థానిక హిందువులను గాయపరిచిన చర్యే తప్ప దానివల్ల ఆ కొండ మీద యాజమాన్యం ముస్లిములకు చెందుతుందని సాక్ష్యం కాదు.
విస్పష్టంగా ప్రీవీకౌన్సిల్ తుది తీర్పు:
— మొత్తం కొండ అంతా దేవాలయానిదే. మసీదు ఉన్న స్థలం, నెల్లితోప్ ప్రాంతాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.
— బ్రిటిష్ ప్రభుత్వానికి ఆ కొండ మీద ఎలాంటి హక్కూ లేదు
— దేవాలయం సెక్యులర్ల చేతుల్లో ఏనాడైనా ఉంది అనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు.
(సశేషం)