హిందువుల ప్రతిఘటన, మదురై ఆలయ పునరుద్ధరణ :
సికందర్ పతనం తర్వాత కంబన్నార్ మదురై దేవాలయాన్ని పునరుద్ధరించే భారీ కార్యక్రమాన్ని తలకెత్తుకున్నాడు. సుల్తాన్లు మదురై మీనాక్షి దేవాలయాన్ని ధ్వంసం చేసేసారు. అలాంటి దుస్థితిలో ఉన్న ఆ గుడిలోకి ప్రవేశించిన కంబన్నార్‌కు ఓ అద్భుతం గోచరించింది. అక్కడ ఓ దీపం అఖండంగా వెలుగుతూ ఉంది. తాజాగా విరిసిన పూవులతో అల్లిన దండ అమ్మవారిని అలంకరించి ఉంది. వాటిని చూసి చలించిపోయిన కంపన్న, దేవాలయ పునరుద్ధరణకు అమ్మవారు అనుమతించిందని భావించి, అదే విషయాన్ని ప్రకటించాడు.
మదురైని స్వాధీనం చేసుకున్న విజయనగర పాలకులు తిరిగి హిందూ సామ్రాజ్య వైభవాన్ని, పాండ్యవంశపు పరంపరనూ పునరుద్ధరించారు. నాటినుంచి 150 ఏళ్ళ వరకూ అంటే 1528 వరకూ మదురైని విజయనగర సామ్రాజ్యం కాపాడింది. 1528లో చోళరాజుల ఆక్రమణతో నాయక వంశం పాలన మొదలైంది.
తిరుపరంకుండ్రం కొండ విషయంలో వివాదం కుట్ర:
సికందర్ షా సమాధి ఇవాళ్టికీ గొరిపాళయంలో ఉంది. అయినప్పటికీ తిరుపరంకుండ్రంలో ముస్లిములకు ఓ తప్పుడు చరిత్రను సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. ఆ కొండకు ఈమధ్య సికందర్ మలై అనే పేరు పెట్టడానికి, అక్కడ కండూరి, జంతుబలి, వనభోజనాలు వంటి – ఇస్లాంలో లేని – ఇస్లామిక్ ఆచారాలను పాటించడానికీ కుట్రలు జరుగుతున్నాయి. వాటివల్లనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
చారిత్రక వాస్తవాలు చాలా స్పష్టంగా, ఏమాత్రం అనుమానాలకు తావులేకుండా ఉన్నాయి. సికందర్ షా అనే వాడు హిందువులను అణగదొక్కి చిత్రహింసలు పెట్టిన దుర్మార్గుడైన రాజు. అతన్ని గొరిపాళయంలో పూడ్చిపెట్టారు, తిరుపరంకుండ్రంలో కాదు. తిరుపరంకుండ్రం కొండ మీద దర్గా సికందర్ దర్గా అనే తప్పుడు ప్రచారం ద్వారా హిందువులకు పరమ పవిత్రమైన గుడి ఉన్న ప్రాంతాన్ని ఇస్లామీకరించే కుట్ర జరుగుతోంది, అక్కడి హిందూ సంస్కృతిని తుడిచిపెట్టేసే ప్రయత్నం జరుగుతోంది.
తిరుపరంకుండ్రం కొండ హిందూ సాంస్కృతిక కేంద్రం:
చరిత్ర ప్రసిద్ధి కలిగిన తిరుపరంకుండ్రం కొండ హిందువులకు ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. కుమారస్వామి ఆరు క్షేత్రాల్లో మొదటిదానిగా భక్తులు అక్కడ పూజలు చేస్తారు. దాన్ని ముస్లిముల దర్గా ఉన్న స్థలంగా పేర్కొంటూ ఆ పర్వతాన్ని ఆక్రమించేందుకు ముస్లిం అతివాదులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పర్వతం 2300 ఏళ్ళకంటె ముందునుంచీ హిందువులకు పుణ్యక్షేత్రమని చారిత్రక రికార్డులు, కోర్టు తీర్పులు, సాహిత్యపరమైన సాక్ష్యాలూ స్పష్టం చేస్తున్నాయి. మదురై మీనాక్షి ఆలయ నిర్వాహకులకు, సికందర్ దర్గా నిర్వాహకులకూ వందేళ్ళ క్రితం జరిగిన గొడవలను మళ్ళీ ఇప్పుడు రేకెత్తించి అక్కడ మతపరమైన ఉద్రిక్తతలకు కారణమవుతున్నారు.
ప్రాచీన మూలాలు – వేలయేళ్ళుగా హిందువుల పుణ్యక్షేత్రం:
తిరుపురంకుండ్రం చరిత్ర 2300 ఏళ్ళ నాటిది. జైన సాధువులు అక్కడ రాతితో నిర్మాణాలు చేసారు. ఆ కొండ మీద శిలలపై తమిళంలో శాసనాలు చెక్కించారు. పూర్వసామాన్యశకం 3వ శతాబ్దం నుంచి సామాన్యశకం 3వ శతాబ్దం వరకూ విలసిల్లిన సంగమ కాలానికి చెందిన తమిళ సాహిత్యంలో అక్కడి మురుగన్ దేవాలయం గురించి ఘనంగా ప్రస్తావించారు. సంగముల కాలం నాటి పద్య సాహిత్యం అకననూరులో ఆ ప్రాంతాన్ని మురుగన్ కుండ్రం – కుమారస్వామి కొండ అని వ్యవహరించారు. స్థానికులైన బోయవాళ్ళు, ఆ కుమారస్వామి కొండ మీద పూజలు చేసేవారు.
సామాన్యశకం 6వ శతాబ్దం నాటికి ఆ కొండను పరంకుండ్రంగా గుర్తించారు. ‘తేవారం’ అనే భక్తికావ్యంలో తమిళ సాధువు తిరుజ్ఞాన సంబందర్ తిరుపరంకుండ్రం పర్వతాన్ని గురించి రాసాడు. సామాన్య శకం 8వ శతాబ్దంలో పాండ్య రాజులు పరాంతక వరగు, అతని సేనాధిపతి సంతాన గణపతి అక్కడ ఆలయ సముదాయం నిర్మించారు. రాక్-కట్ శిలలతో సోమ, స్కందులకు అంకితం చేస్తూ, అక్కడ ఆలయం నిర్మింపజేసాడు. ఆలయ ఆవరణలోనే విష్ణుమూర్తికి కూడా ఆలయం నిర్మించారు. ఆ ఆలయ సన్నిధానంలో జ్యేష్ఠాదేవి (దరిద్ర దేవత) సన్నిధి కూడా ఉంది. దాన్నిబట్టే దేశమంతటా ఉన్న హిందూ సమాజపు సంస్కృతీ సంప్రదాయాలు ఆ గ్రామంలోనూ విశేషంగా ఉన్నాయని తేలింది.
(సశేషం)