మదురై ఆఖరి నవాబు సికందర్ షా – తిరుపరంకుండ్రం వివాదం :
తిరుపరంకుండ్రం కొండ చరిత్రలో ఎన్నో సంక్షోభాలున్నాయి. ముస్లిముల ఆక్రమణలు, మతమార్పిడుల ఘర్షణలున్నాయి. సామాన్యశకం 1310-11 కాలంలో ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ సైన్యాధ్యక్షుడు మాలిక్ కాఫుర్ దక్షిణ భారతదేశం మీద దండయాత్ర చేసాడు. ఆ దాడుల్లో చిదంబరం, మదురై సహా వందలాది హిందూ దేవాలయాలను ధ్వంసం చేసారు, ఆ గుడుల్లోని సంపదలను దోచుకున్నారు. ఆ ఆక్రమణే మదురై చరిత్రలో చీకటి యుగానికి ఆరంభం.
ఢిల్లీ నవాబుల ఏలుబడిలో కొంతకాలం ఉన్నాక మదురై 1331లో స్వతంత్ర ముస్లిం నవాబు పాలనలోకి వచ్చింది. మలబార్‌కు చెందిన పదిమంది సుల్తాన్లు దాదాపు 50ఏళ్ళ పాటు మదురైని పరిపాలించారు. ఆ కాలమంతా స్థానిక హిందువుల ప్రాణాలు కడబట్టిపోయాయి. వేలమందిని నరికి చంపేసారు. వందలాది దేవాలయాలను పడగొట్టేసారు. హిందువుల ధార్మిక సంప్రదాయాలపై నిషేధాలు, ఆంక్షలు విధించారు.
మదురై సుల్తాన్లలో ఆఖరివాడు సికందర్ షా 1369 నుంచి 1378 వరకూ పరిపాలించాడు. ఔరంగజేబులానే సికందర్ షా కూడా హిందువులను హింసించే విధానాల్లో చాలా క్రూరంగా ఉండేవాడు. హిందువుల మీద భారీ పన్నులు విధించడం, హిందువులను ఊచకోత కోయడం, హిందూ దేవాలయాలను ప్రణాళికాబద్ధంగా ధ్వంసం చేయడం అతని పాలన ప్రత్యేకతలు. ఆ చర్యలతో హిందూ జనాభా తీవ్ర ఆగ్రహానికి లోనైంది. సుల్తాన్ను ఎదిరించే పోరాటం మొదలైంది.
విజయనగర సామ్రాజ్యం ఉత్థానం – సికందర్ షా పతనం:
మదురై సుల్తాన్ల దుర్మార్గమైన పరిపాలనతో విసిగిపోయిన హిందువులు తమ ధర్మాన్ని పునరుద్ధరించగల, తమ భూమిని స్వాధీనం చేసుకోగల శక్తివంతమైన రాజ్యం కోసం ప్రయత్నించారు. ఆ క్రమంలోనే 1336లో శృంగేరీ మఠాధిపతి స్వామి విద్యారణ్య మార్గదర్శనంలో హరిహర రాయలు, బుక్కరాయలు అనే ఇద్దరు యాదవ సోదరులు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు.
మదురైలో సుల్తాన్ల రాక్షస పాలనకు చరమగీతం పాడాలనే నిర్ణయంతో బుక్కరాయల కుమారుడు కంపన్నదేవుడు (కంబన్నార్) 1364లో సికందర్ షా మీద దాడి చేసాడు. కొండవీడు రెడ్డిరాజులు మద్దతుగా పంపిన సైన్యం సహకారంతో కంపన్నదేవుడి సేనలు ఎంతోమంది ముస్లిం పాలకులను ఓడించాయి, క్రమంగా కాంచీపురం చేరుకున్నాయి. ఆ సమయంలోనే కంపన్నదేవుడి భార్య రాణీ గంగాదేవి, ముస్లిముల పాలనలో హిందువుల దుస్థితిని వర్ణిస్తూ మధురా విజయం అనే తన ప్రఖ్యాత గ్రంథాన్ని రచించింది.
మధురా విజయంలో ఓ కీలకమైన, శక్తివంతమైన ఘట్టం దైవికమైన జోక్యాన్ని వర్ణిస్తుంది. సుల్తానుల పాలనలో ఛిద్రమైపోయిన మదురైకు చెందిన ఒక మహిళ కంబన్నార్ దగ్గరకు వెడుతుంది, అతనికి ఒక ప్రాచీన ఖడ్గాన్ని కానుకగా ఇస్తుంది. ఆ ఖడ్గం అంతకుముందు మదురైను పరిపాలించిన పాండ్య రాజులది. ఆ మహిళ తాను మీనాక్షీ దేవిని అని వెల్లడించి అదృశ్యమైపోతుంది. మధురా విజయంలోని ఆ ఘట్టం, విజయనగర సైన్యానికి దైవం అండదండలు ఉన్నాయని స్పష్టం చేసింది.
కంబన్నార్ ఎట్టకేలకు 1378లో సికందర్ షాను యుద్ధంలో ఓడించాడు. ఓడిపోయిన సికందర్ తిరుపరంకుండ్రం కొండకు పారిపోయాడు. అక్కడినుంచీ, కంబన్నార్‌కు తనతో ముఖాముఖి ద్వంద్వ యుద్ధం చేయాలని సవాల్ విసిరాడు. ఆ ద్వంద్వ యుద్ధంలో సికందర్ షా ఓడిపోయాడు. అతనికి తీవ్రమైన శిక్ష విధించారు, అతని కుడి కాలు, కుడి చేయి నరికేసారు. అతన్ని కొరత వేసారు. అతని శరీరాన్ని సూదిగా చెక్కిన స్తంభానికి వేలాడదీసారు. భవిష్యత్తులో మదురైను ఆక్రమించుకోవాలనుకునే వారికి అది తీవ్రమైన హెచ్చరికగా నిలిచింది.
సికందర్ షా మరణం, అంత్యక్రియలు:
చారిత్రక రికార్డుల ప్రకారం… సికందర్ షా ప్రియురాలు అతని శరీరాన్ని రహస్యంగా తీసుకుపోయింది, మదురైలోని గొరిపాళయంలో ఉంచింది. కాలక్రమంలో అతను తీవ్ర గాయాల కారణంగా చనిపోయాడు. అతని శవాన్ని అక్కడే పూడ్చిపెట్టారు. ఆ స్థలాన్ని నేడు గొరిపాళయం దర్గా అని పిలుస్తున్నారు. తమిళనాడు రాష్ట్ర పర్యాటక శాఖ సైతం, సికందర్ షా సమాధి గొరిపాళయంలోనే ఉంది తప్ప తిరుపరంకుండ్రంలో కాదని స్పష్టం చేసింది.
చరిత్ర ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ, రాజకీయ ప్రాపకం కలిగిన కొందరు ముస్లిములు ఇటీవల ఆ కొండ తమదేనంటూ దురుద్దేశపూర్వకంగా వాదిస్తున్నారు. అక్కడ దర్గాని చూపించి ఆ కొండ అంతా ముస్లిముల ఆస్తే అంటున్నారు. ఆ వాదనకు చారిత్రక ఆధారాలు లేవన్న సంగతి సుస్పష్టం.
(సశేషం)