తమిళనాడు మదురైలోని చారిత్రక తిరుపరంకుండ్రం కొండ మీది గుడి ఈమధ్య తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఆ దేవాలయం మీద యాజమాన్యం గురించి హిందువులు, ముస్లిముల్లో ఒక వర్గం మధ్య గొడవలు జరుగుతున్నాయి, అధికార డీఎంకే దాని సహచర పార్టీలు, నటుడు విజయ్ జోసెఫ్ పార్టీ టీవీకే, సీమన్ పార్టీ ఎన్‌టీకే, అన్నాడీఎంకే తదితర పక్షాలు ముస్లిం వర్గానికి అండగా నిలిచాయి. అయితే, ఆ కొండ మొత్తం గుడికి చెందినదేనంటూ ఆ ఆలయం హిందూ సాంస్కృతిక వారసత్వ సంపద అని బ్రిటిష్‌వారి పాలనాకాలంలోనే ఒక దావాలో ప్రీవీ కౌన్సిల్ స్పష్టం చేసింది.
మత వివాదాలు, ముదురుతున్న ఉద్రిక్తతలు:
తిరుపరంకుండ్రం కొండ మీద ఈ యేడాది కార్తీక దీపం ఉత్సవ సమయంలో ముస్లిములు గొడవ మొదలు పెట్టారు. అక్కడ ఎన్నో యేళ్ళుగా అనుసరిస్తున్న, కార్తీకపూర్ణిమ నాడు దీపాలు వెలిగించే సంప్రదాయాన్ని జరపకూడదంటూ ముస్లిములు ఈ యేడాది వ్యతిరేకించారు. చారిత్రకంగా తిరుపరంకుండ్రం కొండ మీద మురుగన్ దేవాలయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఐతే కొన్నేళ్ళ క్రితం ఆ కొండ మీద సికందర్ దర్గా పేరిట ఒక దర్గా వెలిసింది. దాంతో ఆ కొండపై యాజమాన్య హక్కులు తమవేనంటూ ముస్లిములు వివాదం లేపారు. నిజానికి తమిళనాడు పర్యాటక శాఖ అధికారిక రికార్డుల ప్రకారం సికందర్ దర్గా గొరిపాళయం అనే చోట ఉంది, దాన్నిబట్టే తిరుపరంకుండ్రం కొండ మీద దర్గా అక్రమంగా వెలసిన సంగతి అర్ధమవుతోంది.
కేరళకు చెందిన నిషిద్ధ ఇస్లామిక్ సంస్థ పీఎఫ్ఐ రాజకీయ విభాగం సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) ఈ అంశాన్ని మరింత రచ్చచేయడానికి ప్రయత్నాలు చేసింది. తిరుపరంకుండ్రం కొండ మీద ‘కండూరీ’ అనే ఆచారాన్ని పాటించడానికి ప్రణాళికలు వేస్తున్నట్లు ప్రకటించింది. కండూరీ అంటే బిర్యానీ తయారు చేయడం, దాన్ని పంచుకుని తినడం. నిజానికి ఇస్లామిక్ సంప్రదాయంలో కండూరీ అనే ఆచారమే లేదు. అది స్థానిక హిందూ సంస్కృతిని అనుకరిస్తూ ముస్లిములు జరుపుకుంటున్న ఆచారం మాత్రమే అని ఎందరో ముస్లిం విద్వాంసులు స్పష్టం చేసారు.
ఆ నేపథ్యంలో తమిళనాడు వక్ఫ్ బోర్డ్ చైర్మన్, రామనాథపురం ఎంపీ అయిన నవాజ్ కనీ, ఆయన అనుచరులు తిరుపరంకుండ్రం కొండ మీదకెక్కి అక్కడ మాంసాహార బిర్యానీ తిన్నారు. హిందువులను రెచ్చగొట్టడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ఆ చర్యతో వివాదం తారస్థాయికి చేరింది. అప్పుడే కొండ మీద జంతుబలులు ఇవ్వడానికి ప్రయత్నాలు జరిగాయన్న నివేదికలు వెలుగు చూసాయి. దాంతో మతపరమైన ఉద్రిక్తతలు రేకెత్తాయి.
హిందూ మున్నాని నిరసన, పోలీసుల దాష్టీకం:
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో హిందూ మున్నాని సంస్థ ఫిబ్రవరి 4న భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పవిత్రమైన మురుగన్ దేవాలయాన్ని ఇస్లామీకరిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ చర్యలను నిలువరించాలని ఆందోళన ప్రారంభించింది. అయితే అందరూ ఊహించినట్లే రాష్ట్రప్రభుత్వం హిందువుల నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరించింది. ఎలాంటి ప్రదర్శనలూ చేపట్టకుండా మదురై జిల్లా అంతటా సెక్షన్ 144 విధించారు. అంతేకాదు, పోలీసులు అత్యుత్సాహంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పలువురిని అరెస్ట్ చేసారు. అసలు ఆందోళనతో సంబంధం లేని వారిని కూడా ఖైదు చేసారు. అంతేకాదు, వారి కుటుంబాల్లోని ఆడవారిని, పిల్లలను సైతం అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ వేర్వేరు చోట్ల నిర్బంధించారు.
(సశేషం)