మహాకుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. ఇవాళ ఉదయం ప్రయాగ్‌రాజ్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ స్వాగతం పలికారు.అనంతరం ఆమె త్రివేణి సంగమం చేరుకుని పుణ్యస్నానం చేసి, పూజలు నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద వేడుక మహాకుంభ మేళాలో ఇప్పటి వరకు 44 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారి యూపీ ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభ మేళాను ఫిబ్రవరి 26 వరకు నిర్వహిస్తారు. దాదాపు 60 కోట్ల మంది పుణ్య స్నానాలు చేస్తారని అంచనా.144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే వేడుక కావడంతో పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు.
మహాకుంభ మేళాకు దారితీసే రోడ్లు కిక్కిరిసిపోయాయి. దాదాపు 300 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వేలాది మంది సొంత వాహనాల్లో మహాకుంభమేళాకు హాజరవుతున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.7 వేల కోట్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 50 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసింది. 3 వేల సీసీ కెమెరాలు, 200 డ్రోన్లతో భద్రతను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. దాదాపు 15 వేల మంది పారిశుద్ధ్య కార్మికులను వినియోగిస్తున్నారు. భక్తుల కోసం 2 లక్షల టెంట్లు ఏర్పాటు చేశారు.