తెలుగువారందరికీ ఆరాధ్యదైవమైన చిలుకూరు బాలాజీ మందిరం అర్చకులు రంగరాజన్ మీద అనూహ్యమైన, అసాధారణమైన దాడి జరిగింది. గుడి పక్కనే ఉండే వారి సొంత ఇంటిలోనే ఆయనను నిర్బంధించి, ఆయనపై దాడి చేసారు. శుక్రవారం రాత్రి జరిగిన ఆ దాడి బాలాజీ మందిరం భక్తుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించింది. చిలుకూరు బాలాజీ ఆలయాన్ని తెలంగాణ తిరుమలగా పరిగణిస్తారు.
యావత్ హిందూ సమాజానికీ దిగ్భ్రాంతి కలిగించిన ఆ దాడికి పాల్పడిన దుర్మార్గులు సైతం హిందువులు కావడం గమనార్హం. తమను తాము ఇక్ష్వాకు వంశ వారసులుగా ప్రకటించుకోవడం, అర్చక సంప్రదాయంపై విద్వేషాన్ని పెంచుకోవడం వారి మూర్ఖ విద్వేష అతివాద భావాలను వెల్లడిస్తోంది. అయితే ఆ వ్యవహారంలో రంగరాజన్ క్షేమంగా ఉండడం ఆలయ భక్తులకు ఒకింత ఊరట కలగజేసింది.
దాడికి పాల్పడిన దుండగులు తమను ఇక్ష్వాకు వంశ వారసులుగా ప్రకటించుకున్నారు. రామరాజ్యాన్ని స్థాపించడమే తమ లక్ష్యం అని చెప్పుకుంటున్నారు. దానికోసం ప్రైవేటు సైన్యాలను ఏర్పాటు చేసుకున్నారు. తమ అతివాద దృక్పథంతో ఏకీభవించని వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. ఆ క్రమంలోనే శుక్రవారం రాత్రి చిలుకూరు బాలాజీ మందిర అర్చకులు రంగరాజన్ గారిని వారి ఇంటిలో కలుసుకున్నారు. రాజ్యాంగబద్ధమైన నియమాలకు లోబడి రామరాజ్యపు సూత్రాలకు కట్టుబడి దైవసేవ చేస్తున్న రంగరాజన్ గారిని తమ అజెండాతో ఏకీభవించాలని డిమాండ్ చేసారు. దానికి అంగీకరించకపోవడంతో ఆయనపై దాడి చేసారు.
రంగరాజన్ తండ్రి, దేవాలయాల పరిరక్షణ ఉద్యమం కన్వీనర్ డాక్టర్ ఎంవి సౌందరరాజన్ వెల్లడించిన వివరాల మేరకు… దుండగులు వారి ఇంట్లోకి చొచ్చుకొనిపోయారు. తాము చెప్పినట్లు చేయడానికి వ్యతిరేకించిన రంగరాజన్‌పై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఎలాంటి రెచ్చగొట్టే చర్య లేకపోయినా ఆయనపై భౌతికదాడికి పాల్పడ్డారు. పలుమార్లు పిడిగుద్దులు గుద్దారు. ఏం జరుగుతోందో అర్ధం కాని పరిస్థితిలో ఉన్న అర్చకస్వామి రంగరాజన్ గారిపై దాడి చేయడాన్ని ఆలయ భక్తులు, హిందూ సంస్థలు తీవ్రంగా ఖండించాయి. ఆ సంఘటన కేవలం అర్చకుడిపై దాడి కాదు, ఆలయం పవిత్రతకు, సంస్కృతీ సంప్రదాయాలకూ, హిందూ ఆధ్యాత్మిక వారసత్వానికీ గొడ్డలివేటు.
జరిగిన సంఘటన మీద పోలీసులకు ఫిర్యాదు చేసామని డాక్టర్ సౌందరరాజన్ వెల్లడించారు. తమ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని తెలియజేసారు. దాడులు చేసిన వారిని మాత్రమే కాక, వారికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో అండగా నిలుస్తున్న నెట్‌వర్క్‌లను సైతం గుర్తించి, వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ధార్మికమైన మనోభావనలను రెచ్చగొట్టి వాటిని తన వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకోవడంపై హిందూ ప్రజలు మండిపడుతున్నారు. ఆలయాల్లో అర్చకులు, పురోహితులకే భద్రత లేకపోవడం, ధర్మ సంరక్షణ పేరిట ఎవరికి తోచినట్లు వారు ప్రవర్తిస్తూండడం దారుణం.