బంగ్లాదేశ్‌లో హింసకు పాల్పడుతున్న వారిపై చర్యలు ప్రారంభించారు. ఆపరేషన్ డెవిల్ పేరుతో రెండు రోజుల్లోనే 1300 మందిని అరెస్ట్ చేసినట్లు బంగ్లాదేశ్ హోం మంత్రి ప్రకటించారు. గత వారం రోజులుగా అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. అవామీలీగ్ నాయకులు, వారి ఇళ్లు, పార్టీ కార్యాలయాలే లక్ష్యంగా అల్లరిమూకలు దాడులు చేస్తున్నాయి. దేశంలో అస్థిరత నెలకొనే ప్రమాదముందని, హింసను అణిచివేయాలని యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆదేశించింది.
ఆపరేషన్ డెవిల్ పేరుతో అవామీలీగ్ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేరుకున్నారనే విమర్శల్లో నిజం లేదని బంగ్లాదేశ్ హోం మంత్రి స్పష్టం చేశారు. దేశంలో అస్థిరత తీసుకురావాలనే ప్రయత్నం చేసే వారి లక్ష్యం నెరవేరకుండా చేయడమే ఆపరేషన్ డెవిల్ అని ఆయన అన్నారు.
గత ఏడాది ఆగష్టు 5న రిజర్వేషన్ల గొడవల్లో హసీనా ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆ తరవాత హసీనా భారత్ చేరుకుని ఆశ్రయం పొందుతోంది. ఇటీవల ఆమె విడుదల చేసిన వీడియో తరవాత బంగ్లాదేశ్‌లో మరోసారి హింస చెలరేగింది. అవామీలీగ్ నాయకునే లక్ష్యంగా అల్లరిమూకలు చెలరేగిపోతున్నాయని షేక్ హసీనా విమర్శలు గుప్పించారు. బంగబంధు ముజిబుర్ రెహ్మాన్ విగ్రహాలు, ఆయన మ్యూజియాన్ని కూడా దుండగులు ధ్వంసం చేసి, దోచుకున్నారు. దీంతో తాత్కాలిక ప్రభుత్వం ఆపరేషన్ డెవిల్ ప్రారంభించింది. అల్లరి మూకలపై ఉక్కుపాదం మోపుతోంది.