అక్రమ వలసదారులను అమెరికా గెంటేస్తున్న కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఓ దారుణం వెలుగు చూసింది. పంజాబ్‌కు చెందిన గుర్‌ప్రీత్‌సింగ్ అమెరికాకు అక్రమ మార్గాల్లో వెళుతూ డంకీ మార్గంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు తారాసింగ్ మీడియాకు వెల్లడించారు.
బల్వీందర్ సింగ్ అనే ఏజంటుకు గుర్‌ప్రీత్‌సింగ్ రూ.16.50 లక్షలు చెల్లించి అక్రమమార్గాల్లో అమెరికాకు బయలు దేరినట్లు సోదరుడు తారాసింగ్ వెల్లడించారు. మూడు నెలల కిందట గుర్‌ప్రీత్‌సింగ్ ఇంటి నుంచి బయలుదేరినట్లు తెలిపారు. ముందుగా గయానా తరలించిన ఏజంటు, అక్కడ ఓ పాకిస్తానీ ఏజంటుకు అప్పగించాడు. అక్కడ నుంచి ఈ పాకిస్థానీ ఏజంటు గుర్ప్రీత్సింగ్ను పనామా ద్వారా కొలంబియా చేర్చారు. గ్వాటిమాలా చేరుకున్నానంటూ గుర్‌ప్రీత్‌సింగ్ సోదరుడు తారాసింగ్‌కు ఫోన్ చేశాడు. ఇక్కడ శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పినట్లు తారాసింగ్ గుర్తుచేశారు. కాసేపటికే గుర్‌ప్రీత్‌సింగ్ చనిపోయినట్లు ఏజంటు ద్వారా తెలిసిందని తారాసింగ్ కన్నీరు మున్నీరవుతున్నారు.
ఇప్పటికే అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన 104 మందిని సైనిక విమానం ద్వారా ట్రంప్ ప్రభుత్వం భారత్‌కు తరలించింది. ఇంకా 18 వేల మంది వరకూ అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్నారని విదేశాంగ శాఖ ప్రకటించింది. వారంతా స్వచ్ఛందంగా భారత్ రావాలని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ పిలుపునిచ్చారు. అయితే ఇప్పటికే మూడు నెలల కిందటే పంజాబ్, గుజరాత్ నుంచి బయలు దేరి డంకీ మార్గంలో 300 మంది వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వారంతా స్వదేశానికి తిరిగి వచ్చేయాలని విదేశాంగశాఖ సూచించింది.