మహాకుంభమేళాలో జరుగుతున్న విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సమావేశాలు నేటితో ముగిసాయి. ఆ సందర్భంగా, జనవరి 5న విజయవాడలో నిర్వహించిన హైందవ శంఖారావం కార్యక్రమంపై రూపొందించిన ప్రత్యేక సంచికను, పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్‌జీ ఇవాళ ప్రయాగరాజ్‌లో ఆవిష్కరించారు.
దేశంలోని దేవాలయాలకు ప్రభుత్వాల నుంచి విముక్తి కోసం విశ్వహిందూ పరిషత్ సుదీర్ఘకాలంగా యోచిస్తోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణ కార్యక్రమం పూర్తయిపోయినందున, ఇకపై ఆలయాల విముక్తి పోరాటంపై దృష్టి సారించింది. అదే సమయంలో తిరుపతి లడ్డూలో కల్తీ వ్యవహారం మీద వివాదం చెలరేగింది. అప్పటికే అంతకు ముందు వైఎస్ఆర్‌సిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని పలు దేవాలయాలపై దాడుల సంఘటనలతో రాష్ట్రంలోని హిందువుల మనఃస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఆ నేపథ్యంలో ‘మందిరాల విముక్తి’ పోరాటాన్ని మొదలుపెట్టడానికి ఆంధ్రప్రదేశే సరైన రాష్ట్రమని విశ్వహిందూ పరిషత్ భావించింది. విజయవాడ చేరువలోని గన్నవరం దగ్గర ‘హైందవ శంఖారావం’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించింది.
దేవాలయాలకు ప్రభుత్వం నుంచి విముక్తి కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో నిర్వహించిన ‘హైందవ శంఖారావం’ సభ భారీగా విజయవంతమైంది. ఆ కార్యక్రమం ఆంధ్రదేశంలోని హిందువుల్లో ఒక ఆలోచనను రగిల్చగలిగింది. వైవిధ్యభరితమైన నేపథ్యాలు కలిగిన వక్తల ప్రసంగాలు పలు దృక్కోణాల్లో హిందువులను జాగృతం చేసాయి. కుల రాజకీయాలే ప్రధానంగా కనిపించే ఆంధ్రప్రదేశ్‌లో కులాలకు అతీతంగా హిందువులందరూ తరలిరావడం, సభను విజయవంతం చేయడం ఒక శుభ పరిణామం. ఆ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి.
ఆ నేపథ్యంలో ప్రయాగరాజ్‌లో నేటితో ముగిసిన మూడు రోజులు విహెచ్‌పి సమావేశాల్లో, హైందవ శంఖారావం కార్యక్రమంపై రూపొందించిన ప్రత్యేక సంచికను విడుదల చేసారు.
ఆ కార్యక్రమంలో విహెచ్‌పి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి బజరంగలాల్ భాగడా, సంఘటన ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే, అంతర్జాతీయ సంయుక్త ప్రధానకార్యదర్శి కోటేశ్వర శర్మ, అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి స్ధాను మాలయాన్ పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి విశ్వహిందూ పరిషత్‌కు చెందిన ప్రధాన నాయకులు పాల్గొన్నారు. కేంద్రీయ సదస్యులు రాఘవులు, భాగ్యనగర క్షేత్ర సంఘటనా కార్యదర్శి సత్యం, ఉత్తరాంధ్ర ప్రాంత అధ్యక్షులు వబిలిశెట్టి శ్రీవెంకటేశ్వర్లు, దక్షిణాంధ్ర ప్రాంత అధ్యక్షులు సాయిరెడ్డి, ప్రాంత కోశాధ్యక్షులు దుర్గాప్రసాద్‌రాజు, ఉత్తరాంధ్ర ప్రాంత ఉపాధ్యక్షులు శ్యాంప్రసాద్ ముఖర్జీ, ఉత్తరాంధ్ర ప్రాంత కార్యదర్శి సుబ్బరాజు, ప్రాంత సంఘటనా కార్యదర్శి శ్రీనివాస రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.