ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా ప్రాంతంలోని విశ్వహిందూ పరిషత్ శిబిరంలో జరిగిన మూడు రోజుల సమావేశం ఈరోజు ముగిసింది. ఈ సమావేశాలు ఎట్టి పరిస్థితిలోనూ మన దేవాలయాలకు ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి కల్పించాలి అనే సంకల్పంతో ముగిసాయి. సమావేశానికి దేశ విదేశాల నుండి వచ్చిన 950 మంది ప్రతినిధులు కలిసి పూర్తి స్థాయి కార్యాచరణను రూపొందించారు. విహెచ్‌పి సమావేశాల వివరాలను సంస్థ అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ ఇవాళ మీడియాకు వివరించారు.
‘మందిరాలకు విముక్తి’ ఉద్యమం తొలి దశలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఇతర హిందూ సంస్థలతో కలిసి ప్రతీ రాష్ట్ర ముఖ్యమంత్రికీ వినతిపత్రం సమర్పించి, హిందూ దేవాలయాలను తిరిగి హిందూ సమాజానికి అప్పగించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తారని తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ భారీ బహిరంగ సభలు నిర్వహించి ఈ డిమాండ్లను బలంగా ప్రదర్శిస్తారని చెప్పారు.
ఉద్యమం రెండో దశలో ప్రతీ రాష్ట్ర రాజధానిలోనూ, ఇంకా ప్రధాన నగరాలలోనూ ప్రభావిత వ్యక్తుల సమావేశాలు ఏర్పాటు చేసి, ఉద్యమానికి విస్తృతమైన ప్రజా మద్దతును సమకూరుస్తారని తెలియజేసారు. ఈ సమస్య తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో వచ్చే శాసనసభా సమావేశాల సమయంలో తమ కార్యకర్తలు శాసనసభ, శాసనమండలి సభ్యులను కలిసి వారి ద్వారా రాజకీయ పార్టీలపై దేవాలయాల విముక్తికి ఒత్తిడి తెచ్చేలా ప్రయత్నిస్తారని వివరించారు.
ప్రయాగరాజ్ మహాకుంభమేళా శిబిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అలోక్ కుమార్ మాట్లాడుతూ, సమావేశంలో దేవాలయాల నిర్వహణకు పూర్తి స్వాతంత్ర్యం ఉండాలని అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారని తెలిపారు. దేవాలయాల నిర్వహణలో బయటివారి నియంత్రణ ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేసారు.
‘మందిరాలకు విముక్తి’ ఉద్యమం ప్రస్తుతం ప్రభుత్వ నియంత్రణలో ఉన్న దేవాలయాల గురించి మాత్రమే తప్ప ఇతర దేవాలయాల గురించి కాదు అని ఆయన వివరించారు.
దేవాలయ నిధులు కేవలం హిందూ ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలి అని పరిషత్ భావిస్తోంది, దానికోసం లెక్కలు, ఆడిట్ సిస్టమ్ పూర్తి పారదర్శకంగా ఉండాలన్నారు.
దేవాలయాల నిర్వహణలో మొత్తం హిందూ సమాజం భాగస్వామ్యం కలిగి ఉండాలని, మందిరాల ట్రస్టులలో మహిళలకు, ఎస్సీ/ఎస్టీ ప్రతినిధులకూ స్థానం ఉండాలని తీర్మానించారు.
అర్చకులు, పురోహితులు, ఇతర దేవాలయ ఉద్యోగులకు అప్పటికే అందుతున్న వేతనాల్లో ఎలాంటి కోత ఉండదని, వారి వేతనం ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం కంటే తక్కువ ఉండకూడదని స్పష్టం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రులను కలిసినప్పుడు, ఆయా రాష్ట్రాలకు ప్రత్యేకంగా రూపొందించిన దేవాలయ విముక్తి చట్టం ముసాయిదాను కూడా అందజేస్తారు అని వారు తెలిపారు.
ఈ సమావేశానికి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు, బ్రిటన్, అమెరికా, కెనడా, జర్మనీ, హాంకాంగ్, మారిషస్, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, థాయిలాండ్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, గయానా మొదలైన దేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధనం, పౌర బాధ్యతలు, స్వదేశీ మరియు స్వాభిమాన భావం అనే ఐదు ప్రధాన అంశాలను ప్రజల నైతిక విలువలు, నడవడిక, సంస్కృతిలో భాగంగా చేయాలనే లక్ష్యంతో తీర్మానం చేసారు. ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజాన్ని ప్రభావితం చేసే వివిధ ప్రధాన అంశాలపై కూడా చర్చించారు.
ఈ సమావేశంలో స్వామీజీ పరమానంద్ మహరాజ్, బౌద్ధ లామా చోస్‌ఫెల్ జ్యోత్పా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబళే, మాజీ సర్‌కార్యవాహ మరియు పరిషత్ పాలక అధికారి భయ్యాజీ జోషీజీ పాల్గొన్నారు.