చైనా దేశపు బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ – బీఆర్ఐ ప్రాజెక్టు నుంచి వైదొలగిన మొదటి లాటిన్ అమెరికన్ దేశంగా పనామా నిలిచింది. పనామా తమ విదేశాంగ విధానాన్ని, చైనాతో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల బంధాలనూ మార్చుకుందనడానికి ఈ పరిణామం నిదర్శనంగా నిలిచింది. పనామా దేశం తీసుకున్న ఆ నిర్ణయానికి కారణం అమెరికా ‘కోల్డ్ వార్ మెంటాలిటీయే’ అంటూ చైనా ఆరోపించింది.
తమ దేశం చేపట్టిన అంతర్జాతీయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను తక్కువ చేస్తూ, అది తప్పు అని నిరూపించడానికి చైనా ప్రయత్నిస్తోందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ విమర్శించారు. ‘‘బెల్ట్ అండ్ రోడ్ సహకారాన్ని ధ్వంసం చేసేందుకు, చైనాకు మంచిపేరు రాకుండా అడ్డుకోడానికి అమెరికా బలంగా ఒత్తిడి చేస్తోంది, నిర్బంధిస్తోంది. అటువంటి అమెరికా చర్యలను చైనా తీవ్రంగా ఖండిస్తోంది’’ అని లిన్ జియాన్ ప్రకటించారు. ఇటువంటి చర్యల ద్వారా అమెరికా తన పెత్తనపు ధోరణిని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇటీవల తన పనామా పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలను చైనా విదేశాంగ శాఖ ఖండించింది. లాటిన్ అమెరికన్ దేశాలకు, చైనాకూ మధ్య దూరాన్ని పెంచేలా, వాటిమధ్య విభేదాలు సృష్టించేలా మార్కో రూబియో మాట్లాడారంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా-లాటిన్ అమెరికా దేశాల మధ్య సంబంధాల గురించి మాట్లాడి, అమెరికా తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందనీ, ఐరాసలో తమ చట్టబద్ధ హక్కులపై దాడి చేస్తోందనీ మండిపడ్డారు.
చైనా చేపట్టిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’లో పనామా 2017లో అంటే మొట్టమొదటిసారి చేరింది. చైనా ప్రాజెక్టులో ఒక లాటిన్ అమెరికన్ దేశం చేరడం అదే మొదటిసారి. అయితే బీఆర్ఐ ప్రాజెక్టు నుంచి తాము వైదొలగుతున్నామని 2025 ఫిబ్రవరి 6న పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములీనో ప్రకటించారు.
కీలకమైన రవాణా మార్గమైన పనామా కాలువను నియంత్రించేర అధికారాన్ని పనామా చైనాకు అప్పగించేసిందని అగ్రరాజ్యం ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచుగా ఆరోపణలు చేస్తూ ఉండేవారు. ఆ ఆరోపణలను పనామా, చైనా రెండూ ఎప్పటికప్పుడు ఖండించేవి. చైనా బీఆర్ఐ ప్రాజెక్టు నుంచి తమ దేశం వైదొలగడానికి అమెరికా ఒత్తిడి కారణం కాదని పనామా అధ్యక్షుడు స్పష్టం చేసారు.