ఏపీ మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శుల సదస్సు ఈ నెల 11న అమరావతిలో జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయం ఒకటో బ్లాక్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది.
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించిన విజయాలు, ఈ ఏడాది తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళిక, మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలు పై సమావేశంలో చర్చించనున్నారు.
కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలు, గత కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలు తీరు, హెచ్ఓడీ కార్యాలయాల నుంచి మండల కార్యాలయాల వరకు ఆన్లైన్లో దస్త్రాల పరిశీలన, ఇతర అంశాల గురించి ఈ సదస్సులో సమాలోచనలు చేయనున్నారు.
ఎంపిక చేసిన ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల్లో ఒక్కొక్కరు మాట్లాడతారు. జిల్లా కలెక్టర్ల సదస్సు జరగాల్సి ఉన్నప్పటికీ శాసనమండలి ఎన్నికల దృష్ట్యా వాయిదా పడింది.