ప్రయాగరాజ్‌లోని త్రివేణీ సంగమం దగ్గర మహాకుంభమేళా సందర్భంగా అసంఖ్యాక భక్తజనం పవిత్ర స్నానాలు చేస్తున్నారు. గంగా యమునా సరస్వతీ నదుల సంగమ స్థానంలో శనివారం వరకూ స్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య 40 కోట్లకు చేరుకుంది.
ఈ యేడాది జనవరి 13న మొదలైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకూ జరగనుంది. మేళా ముగిసేసరికి పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య విషయంలో కొత్త రికార్డులు నెలకొనే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 8 వరకూ 40 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారని యూపీ అధికారులు వెల్లడించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమాగమ కార్యక్రమం అయిన కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచీ భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం నాడు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, ఆయన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, ప్రధానమైన అధికారులు అందరూ కలిసి త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. తర్వాత ప్రయాగరాజ్‌లోనే క్యాబినెట్ సమావేశం కూడా నిర్వహించారు. ప్రభుత్వంలోని మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులు అందరూ కలిసి పవిత్ర స్నానాలు చేయడం, దేశానికి మేలు జరగాలని కోరుకోవడంపై ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దియాకుమారి హర్షం వ్యక్తం చేసారు.
అంతకు ఒకరోజు ముందు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం చేసారు.
మహాకుంభమేళా 2025 పౌష్య పూర్ణిమ సందర్భంగా జనవరి 13న మొదలైంది. మహాశివరాత్రి పర్వదినమైన ఫిబ్రవరి 26 వరకూ కొనసాగుతుంది. ఈ యేడాది కార్యక్రమానికి 45కోట్ల మంది హాజరవుతారని యూపీ రెవెన్యూ విభాగం అధికారులు అంచనా వేసారు. అయితే ఫిబ్రవరి 8 నాటికే 40 కోట్ల సంఖ్యకు చేరుకోవడం విశేషం.