వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్ధనరావు దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ఆయన నివాసంలో గత రాత్రి మనవడి చేతిలో హత్యకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
ఆంధ్రప్రదేశ్ ఏలూరు ప్రాంతానికి చెందిన జనార్ధనరావు ఐదు దశాబ్దాలుగా వ్యాపారరంగంలో ఉన్నారు. ఆయన పలు కంపెనీలను స్థాపించి సమర్థవంతంగా నడిపించారు. ఆస్తుల పంపకాల్లో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పెద్ద కుమార్తె కుమారుడు కిలారు కీర్తితేజకు రూ.4 కోట్ల విలువైన షేర్లను బదిలీ చేశారు. ఆస్తులు సక్రమంగా పంచలేదని గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి సరోజినీదేవి కుమారుడు కీర్తితేజ తాత వద్దకు వచ్చి గొడవకు దిగాడు.
తండ్రికి టీ తెచ్చేందుకు సరోజినీదేవి కిచెన్‌లోకి వెళ్లిన సమయంలో కీర్తితేజ తనవెంట తెచ్చుకున్న కత్తితో 73సార్లు విచక్షణా రహితంగా పొడిచి చంపాడు. అడ్డు వచ్చిన తల్లిపై కూడా కత్తితో దాడి చేశారు. వాచ్‌మెన్ అడ్డురాగా అతన్ని కూడా కత్తితో బెదిరించి పరారయ్యాడు. వాచ్‌మెన్ అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సజోజినీదేవిని ఆసుపత్రికి తరలించారు. జనార్ధనరావు అప్పటికే మరణించినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. భూరిదానాలు చేయడంలో జనార్ధనరావుకు మంచి పేరుంది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పలు దఫాలుగా రూ.40 కోట్లు దానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.40 కోట్లు విరాళం అందించారు.