2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా ప్రధాని నరేంద్ర మోదీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. సంక్షేమాన్ని విస్మరించని అభివృద్ధి కార్యక్రమాలతో ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తోందన్నారు. నరేంద్ర మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో దేశ రాజధాని ఢిల్లీ పాత్ర అత్యంత కీలకమన్నారు. ఈ తరుణంలో ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించడం స్వాగతించదగ్గ పరిణామంగా అభిప్రాయపడ్డారు.
డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమం క్షేత్ర స్థాయికి చేరతాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ అభివృద్ధికి, దేశ రాజధానిలోని ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం వికసిత్ సంకల్ప్ పత్రం ద్వారా బీజేపీ ఇచ్చిన హామీలు ప్రజల మెప్పు పొందాయని గుర్తుచేశారు. నరేంద్ర మోదీపై ఢిల్లీ ప్రజలు ఉంచిన విశ్వాసానికి ఈ విజయం ప్రతీకగా నిలుస్తుందన్నారు.
ఆర్థిక అవకతవకలకు ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల అమలు, పరిపాలన సాగుతాయని అక్కడి ప్రజలు విశ్వసించారని పవన్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరిని పవన్ కళ్యాణ్ కొనియాడారు.