మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆయన సోదరి షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రావాల్సిన షేర్లు విషయంలో అబద్దాలు చెప్పాలంటూ వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని జగన్‌మోహన్‌రెడ్డి ఇబ్బంది పెట్టాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి వైఎస్ బతికుండగానే పెద్దల సమక్షంలో ఆస్తులు ఇద్దరు బిడ్డలకు సమానంగా ఇస్తానంటూ చెప్పినట్లు ఆమె గుర్తుచేశారు. విజయమ్మ తన షేర్లను షర్మిలకు బదిలీ చేసిన తరవాత తండ్రి ఉండగానే ఆస్తులన్నీ పంచారంటూ వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డితో జగన్‌మోహన్‌రెడ్డి అబద్దాలు చెప్పించారని షర్మిల మీడియాకు వెల్లడించారు. విజయసాయిరెడ్డితోనూ అబద్దాలు ఆడించినట్లు ఆమె చెప్పారు.
వైసీపీకి రాజీనామా చేసిన తరవాత విజయసాయిరెడ్డి, షర్మిలతో 3 గంటలపాటు సుదీర్ఘంగా సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జగన్‌మోహన్‌రెడ్డిపై తనను ఎలా ఇబ్బందులకు గురిచేశాడో వివరించాడని షర్మిల గుర్తుచేసింది. తనకు రావాల్సిన షేర్ల విషయంలోనూ విజయసాయిరెడ్డితో, జగన్‌మోహన్‌రెడ్డి అబద్దాలు చెప్పించే ప్రయత్నంలో విఫలమైనట్లు ఆమె అన్నారు.
అబద్దాలు చెప్పలేకే వైసీపీ నుంచి, రాజకీయాల నుంచి బయటకు వచ్చినట్లు విజయసాయిరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు జగన్‌మోహన్‌రెడ్డికి లేదని షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని వాడు రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని షర్మిల ప్రశ్నించారు.