దిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ అధికార దాహమే ఆమ్ ఆద్మీ పార్టీ పతనానికి దారితీసిందని తన మాజీ శిష్యుడి తీరును దుయ్యబట్టారు. ఆప్ పరాభవానికి ముమ్మాటికీ కేజ్రీవాల్ వైఖరే కారణమని విశ్లేషించారు.అవినీతి రహిత పాలన అందిస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్, పాలకపార్టీగా మాత్రం విఫలమైందన్నారు. కేజ్రీవాల్ తీరుతో దిల్లీ ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారన్నారు.
మూడు పర్యాయాలు దిల్లీ సీఎం సీటులో కూర్చున్న కేజ్రీవాల్ పై దేశవ్యాప్తంగా అవినీతి ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు. లిక్కర్ స్కామ్ , కేజ్రీవాల్ కు మరకగా మారిందన్నారు.
అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఉద్యమం చేపట్టగా మద్దతుగా కేజ్రీవాల్ తన ఉద్యోగాన్ని వదులుకుని వచ్చారు. అన్నా హజారేకు శిష్యుడిగా అవినీతిపై కొంతకాలం కలిసిపోరాడారు. ఆ తర్వాత ఉద్యమాన్ని కేజ్రీవాల్ తన చేతుల్లోకి తీసుకున్నారు. కొంత కాలానికి రాజకీయాల్లోకి అడుగుపెట్టి దిల్లీ ఎం సీట్లో కూర్చున్నారు.