ఆప్ ను గెలిపించడం తమ బాధ్యత కాదన్న కాంగ్రెస్
దిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతుండడంపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఆప్, కాంగ్రెస్ పార్టీల అగ్ర నాయకత్వంపై అసహనం వ్యక్తం చేశారు. మీలో మీరు పోట్లాడుకుంటూ ఒకరినొకరు ఓడించుకోండి అంటూ ఎద్దేవా చేస్తూ ఓ వీడియో విడుదల చేవారు.
ఇండీ కూటమిలో ఉన్నప్పటికీ దిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ వేర్వేరుగా పోటీ చేశాయి. సీట్ల సర్దుబాటు విషయంలో అభిప్రాయభేదాలే దీనికి కారణమని పార్టీ వర్గాలు వెల్లడించాయి. విడివిడిగా పోటీ చేయడం వల్ల కాంగ్రెస్, ఆప్ పరస్పరం విమర్శలు చేసుకోవడం బీజేపీకి లాభించిందని ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ నాయకత్వంపై ఒమర్ ఇటీవల వరుసగా విమర్శలు చేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటైన ఇండీ కూటమిలో కాంగ్రెస్, ఆప్ తో పాటు కొన్ని ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ కూటమిలో మరింతగా విభేదాలు పొడసూపాయి.
ఫలితాలపై కాంగ్రెస్ కూడా స్పందించింది. ఆప్ ను గెలిపించడం తమ బాధ్యత కాదని తెలిపింది. ఇప్పటి వరకు ఆ పార్టీ ఏ స్థానంలోనూ ముందంజలో లేదు.