భారత్ మరో మైలు రాయిని చేరుకుంది. దేశంలో లక్ష మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిని సాధించినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. మరో ఐదేళ్లలో 5 లక్షల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఆయన అన్నారు. 2022 నాటికే లక్ష మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సాధించాల్సి ఉండగా కోవిడ్ కారణంగా ప్రాజెక్టు పనులు ఆలస్యం అయినట్లు మంత్రి చెప్పారు.
సౌర పలకలు తయారు చేసే సోలార్ పార్కులు దేశంలోనే నెలకొల్పినట్లు ఆయన చెప్పారు. తద్వారా 100 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం సాధ్యమైందన్నారు. 2014లో దేశంలో కేవలం 2820 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా నేడు లక్ష మెగావాట్లకు పెరిగిందని గుర్తు చేశారు.
సౌర విద్యుత్ ధరలు కూడా యూనిట్ రూ.12 నుంచి రూ.1.99పైసలకు దిగివచ్చాయని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో సౌర విద్యుత్ ధరలు మరింత తగ్గే అవకాశముందన్నారు. 2030 నాటికి దేశంలో వినియోగించే మొత్తం విద్యుత్‌లో పునరుత్పాదక ఇంధన వనరుల వాటా 50 శాతం ఉంటుందని జోషి వెల్లడించారు.